జగిత్యాల, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఇక్కడి సహజవనరులను దోచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకు సాగుతున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రా..? లేక రియల్ ఎస్టేట్ బ్రోకరా..? అని ధ్వజమెత్తారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు.
దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ఇక్కడి సంపదను బ్రిటీషోళ్లు దోచుకుంటే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెసోళ్లు దోచుకోవడం మొదలు పెట్టారని, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంటూ ప్రజల దృష్టిని మళ్లించి రాష్ట్ర భూములను దోచుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో అత్యంత విలువైన భూములను కారుచౌకగా రియల్ ఎస్టేట్ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ఫార్మా సిటీకి సంబంధించి సేకరించిన 14వేల ఎకరాల భూమిని ఫ్యూచర్‌సిటీ పేరిట విక్రయానికి పెడుతున్నారన్నారు. కంచె గచ్చిబౌలి వద్ద 400 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు తన అనునాయులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారన్నారు.
ఈ వ్యవహారంలో 40వేల కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో రైలుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ నిర్వహించాల్సిందని, అయితే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల 11వేల కోట్ల అదనపు భారం తెలంగాణ ప్రజలపై పడుతుందని చెప్పారు. మెట్రో ఆధీనంలో ఉన్న 280 ఎకరాలకు సంబంధించిన భూములపై రేవంత్‌రెడ్డి కన్నేసి ఈ దారుణానికి ఒడిగడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పట్టణ పరిధిలోని రాంచంద్రాపూర్, ఉప్పల్, కూకట్పల్లి, నాచారం, బాలనగర్, పఠాన్ చెరువు పరిధిలో దాదాపు 10వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఈ భూములను అతి తక్కువ ధరకు తన మనుషులకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. టీజీఐఐసీ ధరల కంటే అతి తక్కువగా ఎస్ఆర్వో ధరల్లో ముప్పై శాతం ధరకే భూములను కట్టబెట్టే కుట్ర చేస్తున్నారన్నారు.
ఐదు లక్షల కోట్ల విలువ చేసే భూములను ఐదువేల కోట్లకు అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సిండికేట్‌తో కుమ్మక్కైన రేవంత్‌రెడ్డి, విలువైన భూములను ఖతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పరిశ్రమలను, ఇతర ఉపాధి మార్గాలను పెంపొందించారని, ఈ క్రమంలో టీఎస్ఐపాస్ విధానాన్ని తెచ్చి భూములను కేటాయించడంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు.
వీటి వల్ల లక్షలాది మంది యువతీ యువకులకు ఉపాధి లభించిందని, రా్రష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం పెరిగిందన్నారు. టీఎస్ఐపాస్ దరఖాస్తుల్లోనూ భూముల కేటాయింపులు చేసిన సమయంలో టీజీఐఐసీ నిర్దేశిత ధరల కంటే 300 రెట్లు అధిక ధరలు చెల్లించాలని నిర్ణయించారని గుర్తు చేశారు. అయితే, ఈ విధానానికి మంగళం పాడి సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఎస్ఆర్వో ధరల్లో ముప్పై శాతం ధరకు భూముల కేటాయింపులకు తెగబడడం అన్యాయమన్నారు. సమావేశంలో చీటి వెంకట్రావు, మారు సాయిరెడ్డి, ఎల్లాల దశరథ్ రెడ్డి, చంద్రశేఖర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
స్కాంపై పోరాటం చేయాలి
హైదరాబాద్‌లో ఎకరం ధర 170 కోట్లు పలుకుతున్న తరుణంలో పదివేల ఎకరాల భూమిని కేవలం 5వేల కోట్లకు విక్రయించాలని చూడడం అతి దారుణం. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట మొదలు పెట్టిన ఈ భూముల విక్రయంలో ఐదు లక్షల కోట్ల స్కాం దాగి ఉన్నది. రాష్ర్టానికి రెండేండ్లపాటు కేటాయించేంత సొమ్మును స్కాం చేస్తున్నరు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ పాలసీ. ఈ పద్ధతిలో భూములను కట్టబెట్టడంతోపాటు రెవెన్యూ, హెచ్ఎండీఏకు ఎలాంటి పన్నులు, అనుమతి సుంకాలు లేకుండా చూడడం ఇంకా దారుణం.
ఈ భూముల విక్రయంలో హెచ్ఎండీఏ రుసుం కిందే దాదాపు 15వేల కోట్ల నిధులు సర్కారుకు సమకూరుతయి. అయితే అలాంటివేమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నరు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు ఈ స్కాంపై పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టులాంటి ఈ స్కాంను బీజేపీతోపాటు ఇతర అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవాలి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం దీనిపై ఉద్యమించాలి. ప్రజల నుంచి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హైదరాబాద్‌లో ఇండస్ట్రియల్ ల్యాండ్ పథకం పేరిట రేవంత్‌రెడ్డి తెరలేపిన స్కాంను ప్రశ్నించాలి.
– ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల