Telangana Decade Celebrations | తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కింది. సాహితీప్రియుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ కళారంగానికి పెద్దపీట వేయగా, నాడు ప్రత్యేక పోరాటంలో ఆడిపాడిన కవులు, కళాకారులకు గుర్తింపు లభించింది. రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లాలో 110 మందికి కొలువులిచ్చింది. వృద్ధ కళాకారులకు పింఛన్లు ఇస్తున్నది. తెలుగు భాషా దినోత్సవంతోపాటు రాష్ట్ర ఆవిర్భావం, స్వాతంత్య్ర వేడుకల సమయంలో సాహితీవేత్తలను సత్కరిస్తున్నది. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి కాళోజీ పేరిట ఏటా పురస్కారాలు అందిస్తున్నది. మరుగున పడ్డ కళలకు జీవం పోస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సాహిత్య దినోత్సవం సందర్భంగా, ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : తమ రచనలతో కవులు ఒకవైపు సారస్వతాన్ని సుసంపన్నం చేస్తుంటే, మరో వైపు కళాకారులు తమ ఆ టాపాటలతో సమాజాన్ని చైతన్యవంతం చేశారు. సామాజిక అంశాలపై ఎప్పుడు చైతన్యవంతంగా ఉండే కరీంనగర్ జిల్లా సాహితీవేత్తలు, ప్రజా సమస్యలపై తమ రచనలతో యుద్ధం చేస్తూనే వచ్చారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై అప్పటి పాలకులను, రాజ్యాన్ని ప్రశ్నిస్తూనే వచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో దోపిడీని కండ్లకు కట్టినట్టు వివరిస్తూ, మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, భాష, మాండలికానికి జరుగుతున్న అన్యాయం, అవమానాలు, సమైక్య పాలకుల వివక్ష తదితర అంశాలన్నింటినీ ప్రజల ముందు ఆవిష్కరించారు. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగలించి, స్వరాష్ర్టాన్ని సాధించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కవులు, కళాకారులు నడుం బిగించారు.
2001 నుంచి తెలంగాణ సాం స్కృతిక ఉద్యమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా హోరెత్తించారు. ధూంధాంలతో అప్పటి పోరాట యోధుడు, ఇప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ సాంస్కృతిక యుద్ధానికి ది క్సూచిగా నిలిచారు. ఆయనను, ఆయన బృందా న్ని ఆదర్శంగా తీసుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో కళాకారులు ధూంధాం బృందాలుగా ఏర్పడ్డారు. వేలాది ప్రదర్శనలతో ప్రజలకు, ముఖ్యంగా పల్లెవాసులకు సమైక పాలకులు చేస్తున్న దోపిడీపై అవగాహన కలిగించారు. రెండు దశాబ్దాల ఉద్యమకాలంలో తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ వేల కొద్ది రచనలు చేశారు. పాట లు రాశాలు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి సందర్భంలోనూ పటిష్టంగా ఉంచింది కళాకారులే అని చెప్పక తప్పదు. స్తబ్ధత ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ దాన్ని చేధించింది సాహితీవేత్తలు, కళాకారులే. కళాకారులు, సాహితీవేత్తల ఆశలు ఫలించి స్వరాష్ట్రం సిద్ధించింది.
స్వరాష్ట్రంలో గౌరవం
తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ఓవైపు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తూనే మరో వైపు, కవులు, కళాకారులు, రచయితల సంక్షే మం, తెలంగాణ సాహితీ సౌరభ వికాసానికి ప్రభు త్వం కృషి చేస్తూనే ఉన్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, కళాకారులకు పెద్దపీట వేశారు. స్వయం గా కవి అయిన ఆయన, కళాకారుల ఆలోచనలు, ఆశలు, ఆశయాలు తగ్గట్టుగా సంక్షేమంపై దృష్టి సారించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్రకు సముచిత స్థానాన్ని ఇస్తూ, తెలంగాణ సాంస్కృతిక సారథి వ్యవస్థను సృష్టించడంతోపాటు దానికి 500 కోట్లను కేటాయించారు. ధూంధాంలతో తెలంగాణ ప్రజలను ఏకం గా చేసిన రసమయి బాలకిషన్‌కు మానకొండూర్‌లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడమే కాక, ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం సాంస్కృతిక సారథి చైర్మన్‌ను చేశారు. సాంస్కృతిక సారథి ఆధ్వర్యం లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజాసంబంధ శాఖకు అనుబంధంగా కళాకారులను ఉద్యోగాలుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో 113 మంది కళాకారులు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు.
కాలం మారిన నేపథ్యంలో పూర్వాశ్రమంలో చిందు, యక్షగాన, ఒగ్గు కళాకారులుగా పనిచేసి వయసైన వారికి ఉ పాధి లేని పరిస్థితి ఎదురుకాగా, వృద్ధ కళాకారుల సంక్షేమం కోసం ప్రభు త్వం నెలకు 3,106 పెన్షన్‌ను అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 600 మందికి నెలనెలా పింఛన్ వస్తున్నది. అవకాశమున్న ప్రతి సారి ప్రభుత్వం కళాకారులను గుర్తిస్తూనే ఉన్నది. సన్మానిస్తూనే ఉన్నది. వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నది. జగిత్యాలకు చెందిన ప్రముఖ కవి, రచయిత కేవీ నరేందర్‌కు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తల కు తీవ్రగ్రాయాలు కాగా, వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేయాలని, అందుకు 15 లక్షలు అవుతాయని చెప్పారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్, వెంటనే ఆ డబ్బులను ప్రభుత్వం తరుఫున అం దించారు. ఇటీవలే దివంగతులు అయిన సిరిసిల్లకు చెందిన దివ్యాంగ రచయిత్రి రాజేశ్వరికి ప్ర భుత్వం నెలకు 10వేల చొప్పున పింఛన్ అందించింది. ఏటా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కవులు, రచయితలను సన్మానిస్తున్నది. రామసింహ కవి లాంటి అభ్యుదయ కవులు, అలిశెట్టి ప్రభాకర్, సాహు లాంటి విప్లవకవులు తమ రచనలతో సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చేశారు. జ్ఞానపీఠ అ వార్డు అందుకున్న సింగిరెడ్డి నారాయణరెడ్డి, ముదుగొండ సుజాతరెడ్డి, నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్ కుమార్, కేవీ నరేందర్, పత్తిపాక మోహన్ వంటి వారు అద్భుత రచనలు చేశారు.
అమరవీరుల కలలు
మళ్లీ పురుడు పోసుకున్నాయి
తెలంగాణ ప్రగతి చూడాలంటూ
కండ్లు తెరిచి చూస్తున్నాయి
బీడు భూములల్లో మొలకలు చూసి..
ఎండిన చెరువులో ఊటలు చూసి..
కలతప్పిన పల్లె కాంతులు చూసి..
రైతుల కండ్లల్లో వెలుగులు చూసి..
బంగారు తెలంగాణ బాటకు
వెన్నుదన్నుగా నిలబడుతామంటున్నాయి..
ప్రాణ త్యాగాలకే విలువొచ్చేనంటూ
పోరాట భూమికే వెలుగొచ్చేనంటూ
మన యాస భాషనే బతికొచ్చేనంటూ
గోదారి గడపల్లో అడుగేసేనంటూ
ఆడబిడ్డ బతుకు అరిటాకు చందం
అన్న సామెతనే మార్చేసేనంటూ
దేశ విదేశాలు తొంగి చూసేలా
అభివృద్ధిలో అగ్రగామయ్యేనంటూ
స్వరాష్ట్ర పాలన చూసి ఆత్మలే పులకించిపోయేను
మరు భూమిలో మట్టి విలువను చూసి ఉప్పొంగి పోయేను
స్తూపాలే దీపాలై దారి చూపెనాని
ఆర్తనాదాలకే ఆయువొచ్చేనని
ఉరితాడు సిగ్గుతో తలనువొంచేనని
పసుపు తాడు కలతలే మరిచేనని
బతుకమ్మ బతుకంత దీవెనలివ్వగా
పండుగ పబ్బలే పవరశించేనని
గుడిసె గుండెల్లోనా మేడలు దయించగ
పసిడి పల్లెల్లోన మార్పే వచ్చేనని
కంచంలో మేతుకయ్యి కండ్లారా చూసి కన్నీరే మరిచేను సొంత రాష్ట్ర కల నిజమయినందుకు సంతోషించేను
గోసి గొంగడికే విలువ పెరిగేనంటూ
డప్పు దరువులకే ధైర్య మొచ్చేనంటూ
పాట తూట జనుల మాట అయ్యేనంటూ
కలము కరువలయ్యి పోరు సలిపెనంటూ
ఉద్యమాల పొద్దు గుర్తుచేసుకుంటూ
ఉడుకు బువ్వ తినే జనుల చూసుకుంటూ..
రణ భూమినే ఓమారు కల్లకద్దుకుంటూ
పోరు హోరునే మదిన నిలుపుకుంటూ..
రాముడి పాలన చూసి కలలు గాలిజోలలో ఊగేను ప్రాణాలకే కొత్త రుపోచ్చేనంటూ త్యాగాలే మురిసేను
రచన: మహిపాల్, వేములవాడ
కవులు, రచయితలకు సమున్నత స్థానం
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవులు, రచయితలు, కళలు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు సమున్నత స్థానం లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సాహిత్యం, కళలు తెలంగాణ వచ్చాక అభివృద్ధి పథంలో నడిచాయి. కాళోజీ పేరిట, దాశరథి పేరిట అవార్డులు ఇవ్వడమే కాకుండా సర్కారు రాష్ట్ర అవతరణ సందర్భంగా సాహిత్యకారులను గుర్తించి సముచిత గౌరవం ఇస్తున్నది. తెలంగాణ సాహిత్య అకాడమీ, భాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో మళ్లీ పురుడు పోస్తున్నది. మరుగున పడ్డ కళలు, కళాకారులకు మళ్లీ మంచి భవిష్యత్తు వచ్చింది. కళలు, సాహిత్యం ముఖ్యంగా పాట ఉద్యమంలో పరవళ్లు తొకింది. ఒక ప్రవాహంలా సాగింది. బతుకమ్మ ఒక పోరాట గీతమై సాగింది. పాట.. ఆట.. మాట ఉద్యమంలో పోటాపోటీగా బరి గీసి నిలిచి ప్రశ్నించాయి. రాష్ట్రం అవతరణ తర్వాత అవన్నీ పురుడుపోసుకొని ప్రగతి బాటలో సాగుతున్నాయి. ఇవాళ రవీంద్ర భారతిలో పైడి జయరాజు థియేటర్ లాంటి అనేక వేదికల మీద తెలంగాణ కళలు జీవం పోసుకుంటున్నాయి. సినిమా రంగంలోనూ తెలంగాణ భాష దూసుకుపోతున్నది. ఇదంతా రాష్ట్రం ఏర్పాట్లు వల్లే సాధ్యమైంది.
– పెద్దింటి అశోక్ కుమార్, రచయిత (సిరిసిల్ల)
పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నరు
మాది నందగిరి. నాకు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. చిన్నప్పటి సంది ఒగ్గు కథలు ఇనుకుంట, చూసుకుంట పెరిగిన. ఒగ్గుకథ చెప్పుడు నేర్సుకొని అదే వృత్తిగా బతికిన. ఒకప్పుడు ఒగ్గు కథకు, కథచెప్పే వాళ్లకు మంచి మర్యాద ఉంటుండె. జీవనం మంచిగానే గడుస్తుండె. రానురాను అన్నింటి లెక్కనే ఒగ్గుకథను సూసెటోళ్లు లేకుండా అయిన్రు. నా ఇద్దరు కొడుకులు ఇదే కథ చెప్పుడు నేర్సుకున్నరు. పెద్ద కొడుకు భూమేశ్ వాద్య సహకారం అందితే, చిన్నోడు రాజుకుమార్ కథ చెబుతాడు. ఈ కథలతోటి బతుకలేమని ఎవుసం ఇంక వేరే పనులు చేసుకుంటున్రు. తెలంగాణ ఉద్యమం మొదలైనంక, మస్తు ఊళ్లెల్లో కథ చెప్పినం.
ఎనకట ఒగ్గుకథ దేవుండ్లది, వీరులది చెబితే, ఉద్యమంల మాత్రం తెలంగాణకు జరిగిన అన్యాలమీదే చెప్పినం. తెలంగాణ అచ్చింది. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సర్కార్ కళాకారులను మంచిగనే చూసుకుంటుంది. కొద్దిమందికి సర్కార్ నౌకర్లు ఇచ్చింది. మరికొందరికి పైసలు ఇచ్చింది. కొన్ని కళాబృందాలకు ఇప్పటికీ ప్రోగామ్‌లు ఇచ్చి ఆదుకుంటున్రు. వయసు అయిపోయిన కళాకారులకు పింఛన్ ఇస్తున్రు. రాష్ట్రం రాకముందు నెలకు 500 ఇస్తుండె. మన రాష్ట్రం అచ్చినంక కళాకారులకు 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్రు. కేసీఆర్ సర్కారు మనల్ని ఆదుకుంటున్నది. లేకుంటే నాలాంటి కళాకారులకు మస్తు తిప్పలయ్యేది. ఈ పెన్షన్ మీదనే మస్తుమంది వయసు అయిపోయిన కళాకారులు రెండుపూటల అన్నం తింటున్రు. ఇవి లేకపోతే తిప్పలు అయ్యేది. ముసలోల్లు అయిన కళాకారులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– సింగారపు ఓదెలు, వృద్ధ కళాకారుడు, నందగిరి (పెగడపల్లి)