రాంనగర్, నవంబర్ 16: నేర నియంత్రణలో భాగంగా పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వినియోగించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి పోలీస్ అధికారులకు సూచించారు. కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం కరీంనగర్ రూరల్ డివిజన్‌కు చెందిన పోలీసు అధికారులతో డివిజన్ స్థాయి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేసేలా చూసుకోవాలన్నారు. వాహన తనిఖీల్లో పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ఉపయోగించాలన్నారు. దీని వల్ల పాత నేరస్తులు పట్టుబడే వీలుంటుందన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, అవి పని చేసేలా చూసుకోవాలన్నారు. భౌతిక నేరాలు ఎకువగా నమోదయ్యే ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించి, వాటిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.
మోసపూరిత నేరాలకు పాల్పడి నమోదైన కేసుల్లో నిందితులపై కోర్టుల్లో వెంటవెంటనే చార్జ్ షీట్లు దాఖలు చేయాలని చెప్పారు. అలాగే యాక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్ స్థాయిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులపై సమీక్షించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్, విజయ్ కుమార్, వెంకటరమణ, డివిజన్‌కు చెందిన ఎస్.హెచ్.వో. అధికారులైన ఇన్స్పెక్టర్లతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నగరంలో అర్ధరాత్రి రోడ్లపై సంచరించే యువతను కట్టడి చేసేందుకు వన్ టౌన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం రాత్రి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది పెట్రోలింగ్‌తో పాటు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పెట్రోలింగ్‌లో భాగంగా నిలువ నీడ లేక ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారి వివరాలు సేకరించి, పునరావాస కేంద్రానికి తరలించారు. వృద్ధులను వృద్ధాశ్రమానికి తరలించడంతోపాటు భిక్షాటన చేస్తున్న కొంతమంది వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్‌తో పాటు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా అనుమానితుల వివరాలు సేకరించారు. బస్టాండ్, ఇందిరాచౌక్, కేబుల్ బ్రిడ్జి, వీక్లీ మారెట్ ప్రాంతాల్లో అర్ధరాత్రి జులాయిగా తిరుగుతున్న వారిని గుర్తించి 23 బైకులు, రెండు ఆటోలు, కారు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.