కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటరు నమోదు విషయంలో జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈసారి.. కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. నిజానికి గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునే వారు. ఇలా చేయడం వల్ల నిర్ణీత సమయంలో కొంత మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారని భావించి.. ఈసారి ఈ విషయంలో మార్పులు చేసింది. ఇక నుంచి ఏటా మూడు నెలలకోసారి అంటే.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకుంటూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల కొత్త ఓటర్లు ముఖ్యంగా యువ ఓటర్ల సంఖ్య పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఇదే సమయంలో బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు గరుడ యాప్‌ను అమల్లోకి తెస్తున్నది.
ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా.. గతంలో మాదిరిగా ఒక వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో రెండు లేదా అంతకు మించి నమోదు చేసుకునే వాటికి చెక్ పడుతుంది. ప్రస్తుతం ఒక్కో వ్యక్తి రెండుచోట్ల ఓటు నమోదు చేసుకొని.. తమ ప్రక్రియ నడుపుతున్నారు. ఇక ముందు ఇటువంటి వాటికి అవకాశం ఉండదు. ఇదే సమయంలో ప్రతి ఓటరుకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఆధార్ నంబర్ అనుసంధానం ఐచ్ఛికమే అంటూ ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. కానీ, బోగస్ ఓటర్లకు చెక్పడాలంటే.. ఆధార్ నంబర్‌తో పోల్చి చూసుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంత మంది ఆధార్ ఇవ్వక పోతే కనీసం నంబర్ తీసుకొని అక్కడే పోల్చిచూసుకునే వెసులుబాటు కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఉందని అధికారుల పేర్కొంటున్నారు. ఇందుకోసం ఆగస్టు 1 నుంచి ఇంటింటా సర్వే చేపట్టనున్నారు.
వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్న జాబితా
2023లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈ ఓటరు జాబితే ప్రధాన భూమిక పోషించే అవకాశాలున్నాయి. ఆగస్టు 1న నుంచి మొదలుకొని.. వచ్చే అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రీ రివిజన్ సర్వే నిర్వహించి, నవంబర్ 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. డిసెంబర్ 8 నుంచి ముసాయిదా జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడంతోపాటు డిసెంబర్ 26వ తేదీలోగా వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాని ఆదేశాలు ఇచ్చారు. 2023 జనవరి 5వ తేదీ వరకు తుది ఓటరు జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈసారి సమయం ఎక్కువగా ఉండడం.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జాబితా కీలక భూమిక పోషించనుండడడంతో ఈసారి ఓటరు నమోదుపై ఆసక్తి నెలకొంది.
పకడ్బందీగా కసరత్తు
ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన బూత్‌లెవల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. నియోజకవర్గాల వారీగా ఓటరు నమోదుపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రతి గ్రామం, వార్డు, డివిజన్ పరిధిలో జరిగే ఓటరు నమోదుపై ముందస్తుగా ప్రకటనలు విడుదల చేయడం, సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవడం, స్పందనను బట్టి.. అవసరమైతే అక్కడే ఒకటి రెండు రోజులు ఎక్కువ సమయం వెచ్చించడం చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో 18 ఏండ్లు పూర్తి చేసుకున్న ప్రతి వ్యక్తి తన ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి గతంలోనూ పలుసార్లు ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు అవకాశం కల్పించినా.. పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 29,83,703గా ఉన్నది.
2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు సార్లు ఓటరు నమోదు కార్యక్రమం జరిగింది. కానీ, ఉమ్మడి జిల్లాలో గడిచిన మూడేళ్లలో చూస్తే కొత్తగా 28,155 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నిజానికి అధికారుల అంచనా ప్రకారం ఈసంఖ్య కనీసం 70 వేల నుంచి 80 వేలకు తగ్గకుండా ఉండాలి. కానీ, ఆ దిశగా నమోదు జరగలేదు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గత పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు పలు రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇంటింటా సర్వేతో పాటు ఓటు ఆవశ్యకతను వివరిస్తూ.. గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలతోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తంగా ప్రతి అర్హున్ని ఓటరుగా నమోదు చేస్తే.. కొత్తగా భారీ మొత్తంలో ఓటర్లు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.