తిమ్మాపూర్ రూరల్, జూన్ 24: మారుతున్న కాలానుగుణంగా అంకుర సంస్థలను స్థాపించే ఇన్నోవేట ర్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో టీ హబ్, టీ వర్క్స్, టీఎస్ఐసీ, టా స్క్, రిచ్, వీ హబ్‌ల సహకారంతో నూతన ఆవిష్కరణల కోసం ‘ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదిగిన పలువురి విజయగాథలను ఉదహరించారు. చదువు పూర్తి కాగానే ఉద్యోగ వేటలో పడకుండా.. నూతన ఆలోచనలతో కలలను నిజం చేసుకునేందుకు ప్రభుత్వం, అధికారుల సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేద దళితుల అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని తమ కళాశాల నుంచి ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా టీహబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. టీవర్క్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ కే తేజస్విని మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఇన్నోవేటర్స్ తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం కలెక్టర్‌ను కళాశాల చైర్మన్ సత్కరించారు.