కరీంనగర్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాకు ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేశ్‌బాబు, దాసరి మనోహర్‌రెడ్డి, సంజయ్‌కుమార్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, పోలీస్ హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, న్యాలకొండ అరుణ, దావ వసంత, సహకార బ్యాంక్ చైర్మన్లు, ఆర్బీఎస్ అధ్యక్షులు, నాయకులు, రైతులు తరలివెళ్లారు.
ఉదయం 11గంటల నుంచి 2గంటల వరకు నిర్వహించిన ధర్నాలో పాల్గొని హోరెత్తించారు. సీఎం కేసీఆర్‌తో కలిసిన నిరసన గళం విప్పారు. బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగడుతూ పోరుకు దిగారు. యాసంగిపై స్పష్టత ఇచ్చేదాకా వెనక్కితగ్గేది లేదని తేల్చి చెబుతూ నినదించారు. ధాన్యం కొంటరా..? కొనరా..? యాసంగిలో వరి ధాన్యం వెయ్యాలా..? వద్దా..? అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కొనేదాక తమ ఆందోళన కొనసాగిస్తామంటూ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, ఇన్చార్జి తోట ఆగయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో వెయ్యి మంది తరలి వెళ్లారు. వీరితో పాటు అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.