కరీంనగర్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): పశువుల్లో గాలి కుంటు వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాయి. దేశ వ్యాప్తంగా ఒకే సమయంలో వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించాయి. షెడ్యూల్ ప్రకారం గత జూలైలో ఈ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డది. ఈ క్రమంలో సోమవారం నుంచి డిసెంబర్ 14 వరకు 30 రోజుల పాటు టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 1,77,756 పశువుల్లో 82,412 ఆవు జాతి, 95,344 బర్రె జాతి పశువులు ఉన్నాయి. 3 నెలల పశువు నుంచి ఈ టీకాలు వేస్తున్నారు. జిల్లాలోని 16 ప్రాథమిక పశు వైద్య కేంద్రాలతోపాటు 34 సబ్ సెంటర్ల పరిధిలో ఈ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. వ్యాక్సిన్ వాయిల్స్‌ను జిల్లా కేంద్రంలోని స్టాక్ పాయింట్లో మైనస్ ఉష్ణోగ్రతల్లో నిల్వచేశారు. ఇక్కడి నుంచి అవసరం మేరకు ఐస్ బాక్స్‌ల్లో తీసుకెళ్లి గ్రామాల్లోని రైతుల ఇండ్లకు వెళ్లి పశువులకు టీకా వేస్తారు. 34 పశువైద్య బృందాలు సేవలందిస్తాయి. ఉదయం 7 గంటల నుంచి టీకా వేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 94,500ల పశువులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 36 టీంలను ఏర్పాటు చేసి స్పెషల్డ్రైవ్ను నిర్వహించనున్నారు. ఒక మండలంలో రోజుకు 400 జీవాలకు టీకాలు వేయాలనే లక్ష్యంతో ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో 55,946 ఆవు జాతి పశువులు, 90,633 బర్రె జాతి కలుపుకొని 1,46,579 పశువులున్నాయి. జగిత్యాల జిల్లాలో మొత్తం 1,39,221 పశువులు ఉన్నాయి.
పక్కా ప్రణాళికతో ముందుకు..
గాలికుంటును శాశ్వతంగా రూపుమాపేందుకు పశువైద్య శాఖ పక్కా ప్రణాళిక రూపొందించింది. టీకా వేసిన తర్వాత 14 డిజిట్‌తో ఉన్న యూనిక్ ట్యాగ్‌ను పశువుకు అనుసంధానిస్తారు. ఏ పశువుకు టీకా వేసింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న డ్యాష్ బోర్డులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి రోజూ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తర్వాత ఒక్కో బృందం ఎన్ని పశువులకు టీకాలు వేసింది ఆన్లైన్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. టీకాలు వేయించిన పశు పెంపకందారుల ఫోన్ నంబర్లు కూడా సేకరిస్తున్నారు. అధికారులు లబ్ధిదారులకు ఫోన్ చేసి ర్యాండమ్‌గా తనిఖీ చేపట్టనున్నారు. అలాగే పశువుల్లో టీకా వేసేందుకు నెల రోజుల ముందు ర్యాండంగా కొన్నింటి రక్త నమూనాలు సేకరించారు. టీకా వేసిన నెల తర్వాత మళ్లీ ఇవే పశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి రోగ నిరోధక శక్తి ఏ మేరకు పెరిగిందనేది నిర్ధారిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి..
గాలికుంటు నివారణకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14వరకు వ్యాక్సినేషన్ చేపట్టాం. వ్యాధిబారినపడ్డ పశువుల నోట్లో, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. నాలుకపై పెచ్చులు లేసి గడ్డి మేయని పరిస్థితి ఏర్పడుతుంది. తీవ్రమైన జ్వరంతో నీరసించి పోయి నడవ లేని స్థితికి చేరుతాయి. పశువుల్లో ఏడాదిలో రెండు డోసుల టీకాలు వేయించుకుంటే ఇలాంటి వైరస్లు దరిచేరవు. వ్యాక్సినేషన్‌ను పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి. పశువులకు టీకాలు వేయించి అధికారులకు సహకరించాలి.