కార్పొరేషన్, నవంబర్ 14: నగరంలోని 40వ డివిజన్ గుండ్ల హనుమాన్ కాలనీలో ఆదివారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. కాగా, ముఖ్య అతిథిగా మేయర్ వై సునీల్ రావు హాజరై చిన్నారులను అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహించి, వారి సేవలను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీహరిశంకర్, కార్పొరేటర్లు భూమాగౌడ్, జంగిలి సాగర్, తుల బాలయ్య, హనుమాన్ కాలనీ అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోశాధికారి దయాకర్, సభ్యులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, నవంబర్ 14: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ గురుకుల విద్యాలయంలో ‘బాలల ఉత్సవ్-2021’ పేరిట విద్యార్థులకు సాంసృతిక, క్రీడా అంశాలపై అవగాహన కల్పించారు. నెహ్రూ చిత్రపటానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వీ నరేందర్ రెడ్డి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, అలకాపురికాలనీలోని వీ కిడ్స్ ప్లే స్కూల్లో బాలల దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ మామిడి జ్యోతి, కరస్పాండెంట్ కార్తీక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి చిన్నారులకు పాఠాలు బోధించారు. చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు.
గంగాధర, నవంబర్ 14: బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు రేండ్ల కళింగశేఖర్ పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా కొండన్నపల్లిలో ఆదివారం మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఆడ పిల్లలపై వివక్ష చూపవద్దని కోరారు. సర్పంచ్ రేండ్ల జమున, ఉపసర్పంచ్ నిమ్మనవేణి ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ పద్మ, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు రేణుక, లక్ష్యం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జ్యోతి, లావణ్య పాల్గొన్నారు.