రఘునాథపాలెం, జూన్ 5: సేవా దృక్పథాన్ని అలవర్చుకొని కమ్మ జాతికి వన్నె తీసుకురావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో ‘ఖమ్మం నగర కమ్మ సంఘం’ ఆవిర్భావ సమావేశం జరిగింది. దీనికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమావేశానికి సంఘం బాధ్యులు వల్లభనేని రామారావు అధ్యక్షత వహించగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం కమ్మ కులస్తులకు పుట్టినిల్లుగా భాసిల్లుతోందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మం నగరానికి వచ్చి స్థిరపడిన వాళ్లలో కమ్మ కులస్తులే అత్యధికంగా ఉన్నారన్నారు. సంఘం అభ్యున్నతి కోసం, నిరుపేద కమ్మ కులస్తులను ఆపదలో ఆదుకునేందుకు తనవంతుగా రూ.10 లక్షలు సంఘానికి అందజేస్తున్నట్లు చెప్పారు. పెద్దల సహకారంతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం నూతన సంఘం లోగోను ఆవిష్కరించి, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. సమావేశంలో నగర మేయర్ పునకొల్లు నీరజ, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, నెల్లూరి చంద్రయ్య, నున్నా మాధవరావు, గరికపాటి వెంకటేశ్వరరావు, కర్నాటి కృష్ణ, కొత్తపల్లి నీరజ, బత్తుల మురళీప్రసాద్, నాగండ్ల కోటి, రావూరి కరుణ, గొల్లపూడి రాంప్రసాద్, దేవభక్తుని కిషోర్‌బాబు, గొల్లపూడి హరికృష్ణ, కుర్రా భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.