కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్, జూన్ 3: ‘సమైక్య రాష్ట్రంలో నిధుల్లేక, అభివృద్ధి జాడలేక పల్లెలు, పట్టణాలు అధోగతి పాలయ్యాయి. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలనలో వాడవాడలా ప్రగతి కాంతులు వెల్లివిరుస్తున్నాయి’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గ్రామాలను పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కరీంనగర్‌లోని 22వ డివిజన్ సుభాష్‌నగర్‌లో పట్టణ ప్రగతిని శుక్రవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మేయర్ వై సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి, జూబ్లినగర్‌లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. అనంతరం పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు.
చామనపల్లిలో బడిబాటకు శ్రీకారం చుట్టారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. సీమాంధ్రుల పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని, దరఖాస్తులు ఇచ్చి దండంపెట్టినా పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. ఆనాడు తాగునీటి కోసం ప్రజలు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ, నగరంలో త్వరలోనే 24 గంటల నీటి సరఫరా చేస్తామని చెప్పారు. కరీంనగర్‌ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన హరితహారంతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అన్ని డివిజన్లలో పారులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేబుల్ బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్నాయని, మానేరు రివర్ ఫ్రంట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఇక్కడి యువతకు ఉపాధి కల్పన కోసం ఇకడే ఐటీ టవర్ ఏర్పాటు చేశామని, త్వరలోనే మెడికల్ కళాశాల కూడా వస్తుందన్నారు.
నగర సుందరీకరణలో ప్రజల భాగస్వామ్యంతోనే నగరపాలక సంస్థకు అవార్డులు వస్తున్నాయని పేర్కొన్నారు. నగర వాసులకు అందుబాటులో ఉండే విధంగా నలుదికుల ఇంటిగ్రేటెడ్ మారెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కనుమరుగైన సిర్రగోనే, కబడ్డీ, ఖోఖో లాంటి పల్లె ఆటలకు పూర్వవైభవం తెచ్చేందుకే ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చామనపల్లి కీలకభూమిక పోషించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రోడ్లులేక, తాగునీరులేక చామనపల్లివాసులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఈ ఎనిమిదేండ్ల కాలంలో కోట్లాది నిధులు మంజూరు చేయించి గ్రామ రూపురేఖలు మార్చామన్నారు.
చామనపల్లి ఇరుకుల్ల, ఎలబోతారం, ఫకీర్‌పేట, బహ్దూర్ఖాన్పేటలో రోడ్లు వేశామని చెప్పారు. గ్రామంలోని అప్పన, రాజ్యసముద్రం చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటామని, ఇందుకు 70లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ గంట కళ్యాణీ శ్రీనివాస్, కుర్ర తిరుపతి, జడ్పీ సీఈవో ప్రియాంక, డీపీవో వీర బుచ్చయ్య, డీఆర్డీవో శ్రీలత, తహసీల్దార్ నల్ల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఇన్చార్జి ఎంపీడీవో సంపత్‌కుమార్, సర్పంచ్ బోగొండ లక్ష్మి, జూబ్లినగర్ సర్పంచ్ రుద్ర భారతి, దుర్శేడ్, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్లు, బల్మూరి ఆనందరావు, పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, కాశెట్టి శ్రీనివాస్, సుంకిశాల సంపత్‌రావు, మంద రాజమల్లు, వైఎస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఆరెల్లి శ్రీనివాస్, దావు నిర్మల, గర్వంధ శ్రీనివాస్, తాళ్లపల్లి ఎల్లాగౌడ్, నర్సింగం, పబ్బతి రంగారెడ్డి, ఏఈ రమణారెడ్డి ఉన్నారు.
మన పల్లెలకు జాతీయ ఖ్యాతి
నగరపాలక పాలకవర్గం, అధికారులు, ప్రజల సహకారం వల్లే దేశంలో పరిశుభ్రతలో అవార్డులు వస్తున్నాయి. రాష్ట్రంలో పల్లె ప్రగతిని పకడ్బందీగా అమలు చేయడంతోనే మన పల్లెలకు జాతీయఖ్యాతి వచ్చింది. దేశంలో 100 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపికచేస్తే అందులో 16 మనరాష్ర్టానికి చెందినవే ఉండడం మనకు గర్వకారణం. అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది కృషితోనే ఈ ఘనత దక్కింది. ఇదే స్ఫూర్తితో ఐదో విడుత పల్లె ప్రగతి విజయవంతం చేద్దాం.
– కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు దేశానికే ఆదర్శం. ప్రధానీ మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ ఇలాంటి స్కీంలు అమలు కావడం లేదు. నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌తో పల్లెలు కొత్తరూపును సంతరించుకున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇది ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి. ప్రజలంతా గమనించాలి. నన్ను మూడుసార్లు గెలిపించిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకొనేందుకు అహర్నిశలు కృషి చేస్తా. అనేక సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దీవించాలి.
– మంత్రి గంగుల కమలాకర్