తెలంగాణచౌక్,జూన్ 1: ‘భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నది.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని విశ్వసించని ఆ పార్టీకి దేశాన్ని పాలించే అర్హత లేదు’ అంటూ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మండిపడ్డారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో పలు కుల సంఘాల నాయకులతో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగంపై నమ్మకం లేదని బహిరంగంగా మాట్లాడిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాన్స్టిట్యూషన్ను కించపరిచేలా మాట్లాడిన ఆ పార్టీ ఎంపీలు సంజయ్, అర్వింద్‌కు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సంజయ్ కరీంనగర్లో నిర్వహించిన ఏక్తాయాత్రలో మసీదులు తవ్వాలని, దాడులకు దిగాలని ఏ మత గ్రంథాల్లో ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఏక్తాయాత్రలో నిజమైన హిందువులెవరూ పాల్గొనలేదన్నారు. కేవలం రెండు వేల మందే ఈ యాత్రకు హాజరయ్యారని చెప్పారు. మతవిద్వేషాలు సృష్టించేందుకు యత్నిస్తున్న సంజయ్‌ను తెలంగాణ ప్రజలెవరూ నమ్మబోరన్నారు. ఎంపీగా ఎన్నికైన మూడేండ్లలో ఆయన చేసిన ఒక్క మంచి పని చెప్పాలని సవాల్ విసిరారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ పుట్టకముందు నుంచే దేశంలో హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసిమెలిసి జీవిస్తున్నారని చెప్పారు.
దేశభక్తి పేరిట బీజేపీ యువతను పక్కదారి పట్టిస్తున్నదని, ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అన్నివర్గాల మేలు కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, కానీ బీజేపీ తీరుతో ఇప్పుడు ప్రమాదంలో పడ్డదన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న నగరంలో వేలాదిమందితో కరీంనగర్లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పారు. కులమతాల కతీతంగా తరలివచ్చి విజయవంతం చేసి బీజేపీ నేతలకు కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, ఉపాధ్యక్షుడు కల్వల ఆనంద్, రాష్ట్ర నాయకులు సద్దాల లక్ష్మణ్, గజ్జెల ఆనంద్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్కె సుల్తానా, మహిళా జిల్లా అధ్యక్షురాలు స్వరూప ఉన్నారు.