జగిత్యాల, జూన్ 1;చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు తావు లేకుండా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్యలక్ష్మి యాప్‌ను రూపొందించి పిల్లల బరువు, ఎత్తుతో పాటు సెంటర్లకు వచ్చే సరుకులు, బాలింతలు, గర్భిణుల వివరాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నది. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి పౌష్టికాహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నది.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాల కట్టడే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్యలక్ష్మి అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. స్మార్ట్ఫోన్లలో వివరాల నమోదుపై అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, మెటపల్లి, ధర్మపురి, మల్యాల ప్రాజెక్టుల పరిధిలో 1065 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మల్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 1387 మంది గర్భిణులు, 1245 మంది బాలింతలు ఉన్నారు. 7వ నెల నుంచి 3 సంవత్సరాల్లోపు చిన్నారులు 5,952 మంది, 3-6 ఏళ్ల వరకు 3,281 మంది పిల్లలున్నారు.
అతి తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నవారు 118మంది, మామూలు పోషకాహార లోపం ఉన్నవారు 499 మంది ఉన్నారు. జగిత్యాల ఐసీడీఎస్ పరిధిలో గర్భిణులు 2,417మంది, బాలింతలు 2,144 మంది, 7నెలల నుంచి 3 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులు 11,032 మంది, 3-6ఏళ్ల చిన్నారులు 4,901 మంది ఉన్నారు. అతి తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నవారు 491 మంది, ఎత్తుకు తగిన బరువు పెరగకుండా ఉన్న చిన్నారులు 828 మంది ఉన్నారు. ధర్మపురి పరిధిలో 1,148 మంది గర్భిణులు, 999 మంది బాలింతలు, 3 ఏళ్ల లోపు చిన్నారులు 5,657 మంది, 6 ఏళ్ల లోపు పిల్లలు 2,918 మంది, 149 మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో ఉండగా, 454 మంది చిన్నారులు వయసుకు తగిన బరువు పెరుగకుండా ఉన్నారు.
మెట్పల్లి పరిధిలో 3,303 మంది గర్భిణులు, 2,757 మంది బాలింతలు, 3 ఏళ్లలోపు చిన్నారులు 5,952 మంది, 6 ఏళ్లలోపు పిల్లలు 5,694 మంది ఉన్నారు. 441 మంది చిన్నారులు అతి తీవ్ర పోషకాహార లోపంతో, 845 మంది పిల్లలు తగిన బరువు పెరగకుండా ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా పాలు, కోడిగుడ్లు, బాలామృతంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే పద్ధతిని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్నది.
ఎత్తు, బరువులను కొలిచేందుకు యాప్…
జిల్లాలో 1065 అంగన్వాడీ కేంద్రాలుండగా, 3 ఏళ్లలోపు చిన్నారులు 28,603 మంది ఉన్నారు, 6ఏళ్లలోపు చిన్నారులు 16,824 మంది ఉన్నారు. ప్రతినెలా చిన్నారుల ఎత్తు, బరువును కొలిచేందుకు రాష్ట్ర మహిళాశిశు సంక్షే మ శాఖ వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తె చ్చింది. దీని ఆధారంగా చిన్నారుల ఎత్తు, వయసుకు తగిన బరువు ఉన్నారా? అని పరిశీలించి ఆ వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ఇందుకోసం ప్రతి అంగన్వాడీ టీచర్‌కు ప్రభు త్వం స్మార్ట్‌ఫోన్‌ను అందించింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను ఇన్స్టాల్ చేసి పిల్లల ఎత్తు, బరువు, వయసు వివరాలను నమోదు చేసిన వెంటనే ప్రధాన సర్వర్‌లో గణాంకాలు నమోదవుతా యి. పిల్లల వయసు, ఎత్తు బరువులో తేడాలు ఉంటే వెంటనే సూచనలు ఇస్తుంది. దీంతో సదరు అంగన్వాడీ టీచర్ ఆప్రమత్తమై ఆయా చిన్నారులకు అదనపు పోషకాహారం అందించడంతో పాటు వైద్యుల దృష్టికి తీసుకెళ్తారు. పోషక లోపాలతో బాధపడుతున్న చిన్నారులను ఈ యాప్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
చిన్నారులకు ఇచ్చే మెనూ ఇదే…
అంగన్వాడీ సెంటర్‌కు వచ్చే మూడు నుంచి ఐదేళ్ల చిన్నారులకు ప్రతి రోజు కోడి గుడ్లు, 85 గ్రాముల రైస్, మధ్యాహ్నం 3 గంటలకు స్నాక్స్ అందిస్తారు. ప్రతి నెలా 2,500 గ్రాముల బాలామృతం ప్యాకెట్‌ను ఇస్తున్నారు. సోమవారం అన్నం, కూరగాయలు, సాంబారు, కోడిగుడ్లు, పాలు 900 ఎంఎల్, మంగళవారం అన్నం, పప్పు, ఆకు కూరలతోపాటు కోడిగుడ్లు, పాలు, బుధవారం అన్నం, ఆకుకూర, పప్పు కోడిగు డ్లు, పాలు గురువారం అన్నం, కూరగాయాలు, సాంబారు, పెరుగు 100 ఎంఎల్, కోడి గుడ్లు, పాలు శుక్రవారం అన్నం, పప్పు, కూరగాయల తోపాటు శనివారం అన్నం, ఆకు కూర, పప్పు, కోడిగుడ్డు, పెరుగు, పాలు అందిస్తున్నారు. వీటిని పారదర్శకంగా అందజేసేందుకు స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు.
పారదర్శకంగా పంపిణీ
అంగన్వాడీ సెంటర్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. సర్కారు ఇటీవల రూపొందించిన ఆరోగ్యలక్ష్మి యాప్ ద్వారా అంగన్వాడీ కేంద్రంలో పేర్లను నమోదు చేసుకుంటున్నాం. కోడిగుడ్డు, 150 గ్రాముల అన్నం, పాలు సాంబార్, ఆకు కూర, ఉల్లిగడ్డ, బీన్, పప్పును అందజేస్తున్నాం.
–కే రాణి, అంగన్వాడీ టీచర్, మోరపల్లి
పకడ్బందీగా అమలు చేస్తాం.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన యాప్ వినియోగాన్ని జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంగన్ వాడీ టీచర్లందరికీ స్మార్ట్ఫోన్లు అందించి శిక్షణ ఇచ్చాం. అంగన్వాడీ సెంటర్లకు వచ్చే సరుకులు, విద్యార్థులు, బాలింతలు, గర్భిణులు వివరాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. దీంతో అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఉండదు.
– బోనగిరి నరేశ్, జిల్లా సంక్షేమాధికారి, జగిత్యాల