కార్పొరేషన్, జూన్ 1: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ఐదో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఆయన కార్పొరేటర్లు, ప్రత్యేకాధికారులు, నగరపాలక సంస్థ అధికారులతో పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిషారంపై చర్చించారు. కార్పొరేటర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, డివిజన్ల వారీగా చేపట్టే కార్యక్రమాలపై సమగ్ర ప్రణాళికలను రూపొందించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్పొరేటర్లు, వార్డు కమిటీ సభ్యులు, డివిజన్ ప్రత్యేకాధికారులు, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
మొదటి రోజు వార్డు సమావేశాలు నిర్వహించి గతంలో ఏర్పాటు చేసిన యూత్, మహిళా, సీనియర్ సిటిజన్, ఇతర కమిటీల సభ్యులతో డివిజన్ల వారీగా వివిధ అంశాలపై చర్చించాలన్నారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను గుర్తించి నివేదిక తయారు చేసి, రోజు వారీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డివిజన్లో సర్వే చేపట్టి గుర్తించిన సమస్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డివిజన్లలో పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి రోజు రోడ్లు, మురుగు కాలువలు, ఓపెన్ స్థలాలు, ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేయించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలు, మంచినీటి రిజర్వాయర్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలన్నారు. డివిజన్లలో స్థలాలు ఉన్న చోట మొకలు నాటడంతో పాటు గతంలో నాటిన మొకల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు.
విద్యుత్ సమస్యలను గుర్తించి డ్రైనేజీలు, రోడ్లకు అడ్డుగా ఉన్న స్తంభాలను తొలగించడం, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేసి అవసరమున్న చోట వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైకుంఠధామాలు, పారుల్లో పెండింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని 11 నర్సరీల్లో 6 లక్షల పండ్లు, పూలు, ఔషధ మొకలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి డివిజన్లో 3 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ త్రయంభకేశ్వర్, బల్దియా అధికారులు, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.