డివిజన్‌కు 3 మైదానాలు lనేడు 5 క్రీడ ప్రాంగణాల ప్రారంభం
ఏర్పాట్లను పరిశీలించిన మేయర్
కార్పొరేషన్, జూన్ 1 : నగరాలు, పట్టణాల్లో యువత, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు.రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పలు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించుకోవాలని సూచించింది. ఈ మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 60 డివిజన్లలో భారీ సంఖ్య లో ఏర్పాటు చేసేందుకు మేయర్ వై సునీల్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన స్థలాలను పరిశీలించారు. ఇందులో భాగంగా 60 డివిజన్లలో మూడు చొప్పున మొత్తం 180 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని దశల వారీగా ఏర్పాటు చేయనున్నారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఐదు ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పద్మనగర్, న్యూ శ్రీనగర్ కాలనీ, సప్తగిరికాలనీల్లో ఒక్కటి చొప్పున, హౌసింగ్ బోర్డుకాలనీలో రెండు సిద్ధం చేసినట్లు చెప్పారు.
సకల సదుపాయాలు
ప్రతి వార్డు, డివిజన్లలో ఎకరంలో ఏర్పాటు చేసే క్రీడా కేంద్రంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్‌జంప్, ఎక్సర్సైజ్ బార్స్ ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, యువత కోసం అన్ని పరికరాలను, సౌకర్యాలను ఆయా మున్సిపాలిటీ నుంచి అందిస్తారు. వీటితో పాటు ఈ కేంద్రాల నిర్వహణకు స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లే గ్రౌండ్ అంచున ఒకే వరుసలో మొక్కలు పెంచాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ యా మున్సిపాలిటీల్లోని నర్సరీల్లో లభ్యమయ్యే వేప, బౌహినియా, గుల్మోహర్, సీసూ, కానుగ, బాదం, తంగేడు, చింత, వెదురు మొదలైనవి వాటి మధ్య ఎత్తులో నాటనున్నారు. గ్రౌండ్ చుట్టుపకల సుమారు 300 మొకలు నాటనున్నారు. నేమ్ బోర్డ్‌ను అందించడానికి ఆర్చ్‌తో కూడిన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును అనుసరించడం ద్వారా పట్టణ ప్రగతి నిధుల చేపట్టాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక అధికారిని నియమించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మేయర్
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరీంనగర్ నగరపాలక సంస్థలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురసరించుకొని ఐదు క్రీడా వేదికలను ప్రారంభిస్తామన్నారు. బుధవారం నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీ, పద్మనగర్‌లో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంగణాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ప్రారంభిస్తారన్నారు. మిగతా ప్రాంతాల్లో డివిజన్ల వారీగా స్థలాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఒక్కో ప్రాంగణంలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలతో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం ప్రారంభించే ప్రాంగణాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇక్కడ కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్ శ్రీకాంత్, ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, ఈఈ కిష్టప్ప, మ హేందర్, డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.