హుజూరాబాద్, మే 31 : సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతన్నకు లాభం జరుగుతుంది. ఇంకా రైతులంతా ఐకమత్యంగా ఉంటే మరింత మేలు జరుగుతుంది. పంటకు మద్దతు ధర దక్కుతుంది. మార్కెట్లో ధర రానప్పుడు సొంతంగా ప్రాసెసింగ్ చేసి అమ్ముకునే సామర్థ్యం వస్తుంది. ఇదంతా సొసైటీగా ఏర్పడితేనే సాధ్యమవుతుంది. ఈ మేరకు రైతుల్లో చైతన్యం తెచ్చేందుకు నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) సహకారంతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఎ) స్వచ్ఛంద సంస్థ విశేషంగా కృషిచేస్తున్నది. కొన్నేండ్లుగా దేశంలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు (ఎఫ్‌పీవో)లను ఏర్పాటు చేస్తూ నిత్యం సలహాలు, సూచనలు చేస్తూ అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు విజయవంతంగా నడుస్తుండగా మన ప్రాంతంలో తుమ్మనపల్లి, సింగాపూర్, మాందాడిపల్లి గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకొని కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేసింది.
సీఎస్ఏ ప్రోత్సాహం..
రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వ్యవసాయంలో ఎదుర్కొంటున్న చాలా సమస్యలను పరిష్కరించేందుకు సీఎస్ఏ విశేషంగా కృషిచేస్తున్నది. దేశంతోపాటు మన రాష్ట్రలో 2004 నుంచి రైతుల శ్రేయస్సు కోసం, రైతుల ఆదాయ భద్రత కోసం పని చేస్తున్నది. సేంద్రియ వ్యవసాయాన్ని, రైతు సహకార సంఘాలను, కంపెనీలను ప్రోత్సహిస్తూ కృషి చేస్తున్నది. ఏడేండ్లుగా 3వేల మంది సేంద్రియ రైతులతో ఏర్పడిన సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ నిర్వహణకు సహకారం అందిస్తున్నది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 6వేల సంఘాలు ఏర్పడగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో 400 చొప్పున సొసైటీలను ఏర్పాటు చేసింది.
ఎఫ్పీవోలుగా ఏర్పడితే అధికమేలు
రైతు సహకారసంఘాలు, ఉత్పత్తిదారులు ఓకంపెనీగా అవతరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సంఘ సభ్యులు తమ వ్యవసాయానికి అవసరమైన అన్ని పంటల విత్తనాలను స్వయంగా పండించుకుని, పరస్పరం పంచుకోవచ్చు. విత్తన పరిశోధనా సంస్థల నుంచి, వివిధ విత్తన సహకార సంఘాల నుంచి నాణ్యమైన విత్తనాలను, మన దగ్గర లేని వెరైటీలను తకువ ధరకు ఉమ్మడిగా తెప్పించుకొని మళ్లీ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ డీలర్లు, వ్యాపారులపై ఆధారపడకుండా వ్యవసాయశాఖలు సూచించిన ఎరువులు, పురుగు మందులను అవసరమైన మేరకు నేరుగా ఆయా కంపెనీల నుంచి తెప్పించుకుని లాభం పొందవచ్చు. అలాగే రసాయన సేద్యాన్ని పక్కన పెట్టి సేంద్రియ ఎవుసాన్ని చేయవచ్చు. డీజిల్ ధరల నేపథ్యంలో యంత్రాల కిరాయి కూడా పెరిగి పోతోంది. ఈ నేపథ్యంలో రైతులకు అవసరమైన పనిముట్లు, చిన్న యంత్రాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఏర్పాటు చేసుకుని తక్కువ ధరకే రైతులకు యంత్రాలను కిరాయికి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది.
పంటకు మద్దతు.. అనేక ప్రయోజనాలు
సంఘంగా ఏర్పడితే మార్కెట్లో డిమాండ్ ప్రకారం పంటలను పండించవచ్చు. సభ్యులు పండించే పంటల సేకరణకు ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి సేకరణ కేంద్రాలను నిర్వహించవచ్చు. ఆయా పంటలను సభ్యుల నుంచి నేరుగా సేకరించి, గ్రేడింగ్, క్లీనింగ్ చేసి, అవసరమైనప్పుడు ప్రాసెస్ కూడా చేసి గిట్టుబాటు ధరలకు వ్యాపారులకు ఉమ్మడిగా అమ్మవచ్చు. ఇందుకు అవసరమైన బిజినెస్ ప్లాన్ తయారు చేసుకుని, అవసరమైన నిర్వహణ పెట్టుబడి కోసం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకోవచ్చు. సభ్యుల పంటలకు సరైన ధరలు రానప్పుడు స్వయంగా సంఘమే శీతల గిడ్డంగులు నిర్మించుకుని, నిల్వ చేసుకుని, వ్యాపారులు మంచి ధరలు చెల్లించేలా బేరమాడి అమ్ముకోవచ్చు.
ఐదేండ్లు పాటు నిర్వహణ ఖర్చులు
సెంట్రల్ సెక్టార్ సీమ్ కింద రాబోయే ఐదేండ్లలో దేశ వ్యాప్తంగా 10వేల సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బాధ్యత ఇవ్వగా, రాష్ట్రంలో సీఎస్ఏకు సంఘాల ఏర్పాటు నిర్వహణను అప్పజెప్పింది. ఈ సంస్థలు సంఘాలకు ఐదేండ్లపాటు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తాయి. సంఘం రిజిస్ట్రేషన్ ఖర్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు శిక్షణ, అకౌంటెంట్లకు నెలవారీ వేతనం, సంఘం కార్యాలయం అద్దె, కరెంటు, ఫోన్ బిల్లు, సంఘం కార్యాలయంలో ఫర్నీచర్, సంఘం మీటింగుల ప్రాథమిక ఖర్చులు, స్టేషనరీ ఖర్చుల కోసం ఈ సంస్థలు ఆర్థిక సహకారం అందిస్తాయి.
అందరి సహకారంతోనే సంఘం అభివృద్ధి
ఒక గ్రామం లేదా కొన్ని గ్రామాలు యూనిట్‌గా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిని క్లస్టర్ అంటారు. ఆ క్లస్టర్లో వివిధ పంటలు పండించే రైతులు సంఘం నిర్ణయించిన ప్రాథమిక అమౌంట్ చెల్లించి సభ్యత్వం తీసుకోవచ్చు. అయితే ప్రధానంగా సన్న, చిన్న కారు రైతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, వెనుకబడిన వర్గాలకు చెందిన రైతులు, కౌలు రైతులు, మహిళా రైతులను సంఘంలో చేరేందుకు ప్రాధాన్యత ఉంటుంది. వ్యవసాయంతో సంబంధం లేని వారు అనర్హులు. సంఘానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మారెటింగ్, బ్యాంకింగ్, బీమా, లేబర్, గ్రామీణాభివృద్ధి సంస్థల అధికారుల సహాయ సహకారం అందిస్తూ ఉంటారు.
మూడు గ్రామాలు క్లస్టర్‌గా ఏర్పాటుకు కృషి..
తుమ్మనపల్లి, సింగాపూర్, మాందాడిపల్లి క్లస్టర్‌గా రైతు ఉత్పత్తి దారుల సంఘాన్ని సీఎస్ఏ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే రైతులతో పలుమార్లు సమావేశం నిర్వహించింది. 15మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను కూడా ఎన్నుకోగా వారు రైతులతో మాట్లాడుతున్నారు. ఎన్నికైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీవోడీ) సంఘానికి ప్రధాన బాధ్యులుగా ఉంటారు. సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) రోజువారీ సంఘ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు.
వెయ్యి మందితో సంఘం..
తుమ్మనపల్లి, సింగాపూర్, మాందాడిపల్లి క్లస్టర్లో వెయ్యి మంది రైతులతో సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు పెట్టినం. 15మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నిక చేపట్టాం. సంఘం పేరుమీద బ్యాంకు అకౌంట్ రెండ్రోజుల్లో తెరుస్తాం. ఆ తర్వాత సభ్యుల నమోదు ప్రక్రియ జరుగుతుంది. సేంద్రియ సాగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సీజన్లో 300 ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేసేలా అవగాహన కల్పించాం. – దొడ్డె రమేశ్, సీఎస్ఏ ప్రతినిధి