కోల్‌సిటీ, మే 31 : అది సాధారణ టైలర్ దుకాణం. చూడ్డానికి పాన్ డబ్బాలా కనిపిస్తున్నా అదిరేటి డ్రెస్సులు కుట్టడంలో గొప్ప పేరుంది. ఆధునిక పాశ్చాత్య పోకడల కాలంలో కొత్తగా ఎన్ని షాపులు వెలుస్తున్నా.. రెడీమెడ్ దుకాణాలు, మాల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా ఇక్కడ కుట్టే దుస్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది. నగరమే కాదు పారిశ్రామిక ప్రాంతంలోనే చాలా పాపులర్ అయింది. పేరుకు అది రేమాండ్స్ టైలర్ షాపు అయినా.. జనగామ టైలర్ షాపుగా పేరువోయి, నాలుగు దశాబ్దాలుగా వినియోగదారుల మదిని దోచేస్తున్నది. నగరం నుంచే గాకుండా కాగజ్‌నగర్, మంథని, పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్ నుంచి అనేక మంది వచ్చి బట్టలు కుట్టించుకుంటారంటే ఈ షాపు ప్రత్యేకత ఏంటో అర్థమైపోతున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా తండ్రీ కొడుకులు మొలుగూరి శంకర్, సంతోష్ డ్రెస్సులు కుట్టడంలో ఆరితేరి, ఎలాంటి డిజైన్‌లో అయినా, ఏ మోడల్ అయినా సరే వాస్కోట్, జ్యోతిపూర్, వివిధ రకాల షూట్లు, షెర్వాణి సహా యాంకిల్ ఫిట్, ఫార్మల్, లాల్చీ పైజామా, వివిధ రకాల షూట్లు, ఫార్మర్ దుస్తులను అలవోకగా అల్లేస్తూ కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తుండడంతోనే టైలర్‌కు పేరు వచ్చింది. నేడు జాతీయ దర్జీ దినోత్సవం సందర్భంగా శంకర్‌పై నమస్తే ప్రత్యేక కథనమిది.
చాలా శ్రద్ధ తీసుకుంటాం..
తమను నమ్ముకొని ఎక్కడెక్కడ నుంచో చాలా మంది బట్టలు కుట్టించుకోవడానికి వస్తుంటారు. వినియోగదారుల అభిరుచులకు తగినట్టుగా ఆయా డిజైన్లతో స్టిచ్చింగ్ చేయడమేకాకుండా ధరించగానే సరిగ్గా సరిపోయేలా కుట్టేందుకు చాలా శ్రద్ధ తీసుకుంటాం. 30 ఏళ్లుగా ఈ వృత్తితో జీననోపాధి పొందుతున్న. 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎలాంటి డిజైన్లలో కావాలంటే అలా కుట్టిస్తాం. – మొలుగూరి శంకర్