న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉద్యోగులు, కార్మికులతో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్న దేశాలలో భారత్ ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. వారానికి 16 అంతకన్నా ఎక్కువ వేతనం లేని పనిగంటలతో భారత్ తొలిస్థానాన్ని ఆక్రమించిందని పీపుల్స్ ఎట్వర్క్ 2026 పేరిట ఏడీపీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. దేశంలోని 24 శాతం మంది కార్మికులు ప్రతి వారం 16, అంతకన్నా ఎక్కువ గంటలు ఎలాంటి వేతనం పొందకుండానే తమ సేవలు అందిస్తున్నారని, మరో 40 శాతం మంది వారానికి ఆరు నుంచి 15 గంటలు వేతనం లేని పనిగంటలతో శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది.
అంటే భారతదేశంలోని శ్రామికశక్తిలో గణనీయమైన భాగం తాము పనిచేసే గంటలను వేతనం లభించే పనిగా పరిగణించకుండానే యాజమాన్యాల కోసం తమ శ్రమను వెచ్చిస్తున్నది. అయితే ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి అంత తీవ్రంగా లేదు. 62 శాతం మంది కార్మికులు వారానికి ఐదు వేతనం లేని పనిగంటలు, 26 శాతం మంది ఆరు నుంచి 15 గంటలు, 12 శాతం 16, అంతకు మించి పనిగంటలతో విధులు నిర్వహిస్తున్నారు. అత్యధిక సమయం కార్మికులతో పనిచేయించినంత మాత్రాన ఉత్పత్తి పరిమాణం పెరుగుతుందని భావించడం సరికాదని ఆ నివేదిక తెలిపింది. వేతనం లేని పనిభారం అధికంగా ఉన్న కార్మికులు తాము తమ సామర్థ్యానికి తగిన స్థాయిలో పనిచేయడం లేదని చెప్పే అవకాశం ఉందని, అంతేకాక పనిలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఉద్యోగాన్ని వదిలేయాలనే ఆలోచన ఎక్కువగా ఉండవచ్చునని ఆ సర్వే తెలిపింది.