కలెక్టరేట్, మే 31: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పిలుపునిచ్చారు. జూన్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ఐదో విడుత పల్లె ప్రగతి నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది పల్లెల అభివృద్ధే ధ్యేయంగా విధులు నిర్వర్తించాలన్నారు. పల్లె ప్రగతి ప్రారం భం రోజున గ్రామాల్లో పాదయాత్రలు, గ్రామసభలు నిర్వహించి సీఎం సందేశాన్ని చదివి వినిపించాలన్నారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని, ఒక రోజు పవర్ డే పాటించి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. తాగునీటి వనరులను గుర్తించి శుభ్రం చేయాలని, డంప్‌యార్డు, వైకుంఠధామాలను సందర్శించాలని సూచించారు.
శ్రమదానంతో పిచ్చి మొక్కలు తొలగించాలని, పాడుబడిన బావులు, ఇండ్లను తొలగించాలన్నా రు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో ఈ ఏడాది వరకు 7.5శాతం పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీనరీ పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. గ్రామాల్లో క్రీడా మైదానాలు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. జూన్ 3లోగా గతేడాది ప్రణాళికలో మిగిలిన పనులపై అవగాహన చేసుకొని వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బీ సత్యప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్స య్య, జడ్పీసీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో రవీందర్, డీఆర్డీవో మదన్మోహన్, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవో లు తదితరులు పాల్గొన్నారు.