మానకొండూర్, మే 31: మండలంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అడిషనల్ డీఆర్డీవో, పల్లెప్రగతి మండల ప్రత్యేకాధికారి బీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఎంపీపీ ముద్దసాని సులోచనాశ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 5వ విడుత పల్లెప్రగతి సన్నాహక సమావేశం జరిగింది. కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 15 రోజుల పాటు పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రతిరోజూ గ్రామాల్లో పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మండలంలో ఆయా గ్రామాల్లో ఎంపిక చేసిన ఆరు క్రీడాప్రాంగణాలను జూన్ 2న ప్రారంభించాలని సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలలను గుర్తించాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మండలాన్ని జిల్లాలో ఆదర్శంగా నిలుపడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీవో రాజేశ్వర్‌రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి: ఎంపీపీ వినీతాశ్రీనివాస్రెడ్డి
చిగురుమామిడి, మే 31: ప్రభుత్వం చేపట్టనున్న పల్లె ప్రగతి 5వ విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జడ్పీటీసీ గీకురు రవీందర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ఈ నెల 3 నుంచి 18 వరకు పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టనున్న పనుల వివరాలు వెల్లడించారు. వాటిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి నతానియేల్, ఎంపీడీవో నర్సయ్య, ఎంపీవో శ్రావణ్ కుమార్, ఏపీవో లక్ష్మి పేరందేవి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికే ‘పల్లె ప్రగతి’మండల ప్రత్యేకాధికారి జయశంకర్
గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నదని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి జయశంకర్ కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం పల్లె ప్రగతి 5వ విడుతపై మండల ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి హాజరై, అవగాహన కల్పించారు. పల్లెప్రగతిలో చేపట్టనున్న పనులను ప్రత్యేకాధికారులు ప్రతినిత్యం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎంపీవో కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మండలాన్ని జిల్లాలో ముందంజలో నిలుపాలి:ఎంపీపీ లింగాల మల్లారెడ్డి
‘పల్లె ప్రగతి’ అమలులో అందరూ భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేసి మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుపాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన పల్లె ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ నెల 3 నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి 5వ విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, ఏవో కిరణ్మయి, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్‌రావు, ఏపీఎం లావణ్య, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు పాల్గొన్నారు.