ధర్మపురి, మే31: బీర్పూర్ మండలం తుంగూర్కు చెందిన నిరుపేద కుటుంబానికి ఫేస్బుక్ మిత్రులు చేయూతనిచ్చారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఇంటి నిర్మాణానికి రూ.1.10లక్షల ఆర్థిక సాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పోతురాజు రాజనర్సు గ్రామంలో గిర్ని(ఫ్లోర్‌మిల్)లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఏడాది క్రితం మృతిచెందాడు. రాజనర్సు బాగున్నపుడు రెండు గదులతో ఇంటి నిర్మాణ పనులను పునాదుల వరకు చేయగా, అతని మృతితో పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలో భార్య బీడీలు చుడుతూ ఇద్దరు పిల్లలను పోషిస్తూ, గుడిసెలో నివసిస్తుండగా, సామాజిక మాధ్యమాల ద్వారా వీరి దీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేనికుంట రమేశ్ స్పందించాడు. జలను ఆదుకోవాలని, బ్యాంక్ ఖాతా వివరాలతో ఫేస్బుక్లో పోస్టు చేయగా, తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు, దాతలు స్పందించి, ఖాతాలో రూ.1.10లక్షలు జమచేశారు. ఇందులో నుంచి రూ.97వేలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించి, మిగిలిన రూ.13వేలు ఖాతాలో నిల్వ ఉంచారు. సాయం చేసిన దాతలకు, రమేశ్‌కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.