కార్పొరేషన్, మే 26: టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని, కానీ బీజేపీ నాయకులు మాత్రం మతం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఏ మత ప్రజలు కూడా ఒప్పుకోరని పేర్కొన్నారు. గురువారం స్థానిక జ్యోతినగర్‌లోని బీరప్ప దేవాలయ సమీపంలో రూ. 9.90 లక్షలతో చేపడుతున్న బీరప్ప కుర్మ సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో ఎటుచూసినా అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అభివృద్ధి ఎలా ఉందో , ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఎలా సాగుతున్నదో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అప్పుడు కూడా ప్రజలు పన్నులు కట్టినా ఎక్కడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవన్నారు. ఉద్యమకారుడు పాలకుడవడంతోపాటు తెలంగాణ ఎలా అభివృద్ధి జరగాలని ఆలోచన ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. వేలాది కోట్ల రూపాయలతో కరీంనగర్, జిల్లా అభివృద్ధికి నిధులు ఇచ్చారని, మానేరు రివర్ ఫ్రంట్, రోడ్లు, మెడికల్ కళాశాల, కేబుల్ బ్రిడ్జి ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో విధ్వంసాన్ని ఎవరూ కోరుకోరని, అభివృద్ధి కోరుకుంటారని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో సంజయ్‌లాంటి వ్యక్తులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల అనేకసార్లు కర్యూలు విధించారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు రాకుండా శాంతిభద్రతలను కాపాడుకుంటున్నామన్నారు. ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండడం వల్లే శరవేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయన్నారు. గుడులు, మసీదులు కూలుగోడుతామని విధ్వంసం చేసే వ్యాఖ్యలు చేయడం కా దని, చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తీసుకువచ్చి గడ్డపారలతో అభివృద్ధి కోసం తవ్వకాలు చేపట్టాలని బండి సంజయ్‌కుమార్‌కు సూచించారు.
గుజరాత్లో శాంతిభద్రతలు సక్రమంగా లేకపోవడం, ఇలాంటి వ్యాఖ్యలతో ఎప్పుడు ఇబ్బందులు వస్తుండడం వల్లే ప్ర పంచంలోని ఏ సంస్థలు కూడా గుజరాత్‌కు రావడం లేదని గుర్తు చేశారు. బండి సంజయ్ కుమార్ తన వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని, ఇందుకు గుజరాత్ నిదర్శనం గా నిలుస్తున్నదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణలో కాదు… బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేసుకోవాలని హితవు పలికారు. తమ ఆలోచనలన్నీ అభివృద్ధి చేయడం పైనే ఉంటాయని, బీజేపీ ఆలోచనలన్నీ మతకల్లోలాలపైనే ఉంటాయని విమర్శించారు.
మేము అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతున్నామని, బీజేపీ మ తాన్ని చూపించి ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు. ఇది భవిష్యత్తులో రాష్ర్టానికి, ప్రజలకు మంచిది కాదన్నారు. అన్ని మతాల ప్రజలు కలి సి జీవిస్తారని, అది తెలంగాణ సంస్కృతి అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం బండి సంజ య్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంకో మతం గురించి మా ట్లాడడాన్ని ఏ మతం ఒప్పుకోదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు ఐలేందర్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకులు గందె మహేశ్, సదానందాచారి, ఎడ్ల అశోక్, కుర్మ సంఘం నాయకులు రాజమల్లు, బీరయ్య, కర్రె రాజు, కరుణాకర్, కర్రె శ్రీనివాస్, చిగుర్ల మల్లేశం, శ్యాంసుందర్ పాల్గొన్నారు.