సిరిసిల్ల/గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల టౌన్, మే 10 : అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ.. శంకుస్థాపనలు చేస్తూ.. పరిశీలిస్తూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పలు మండలాలతో పాటు సిరిసిల్ల పట్టణంలో దాదాపు రూ.25.18 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. సుమారు ఆరున్నర గంటల పాటు పర్యటించిన ఆయన, గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేటలో డబుల్ బెడ్రూం ఇండ్లు, బొప్పాపూర్‌లో గోదాం, హరిదాస్‌నగర్‌లో గ్రంథాలయం, సిరిసిల్లలో కొత్త చెరువు, మినీ స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కోరుట్లపేటలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్మిక క్షేత్రంలో ఒకేసారి అనేక అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొన్నది.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా తమ పూర్వీకుల గ్రామమైన కామారెడ్డి జిల్లా కోనాపూర్ నుంచి బయలుదేరిన మంత్రి మధ్యాహ్నం 1:30 గంటలకు గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేటకు చేరుకోగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ స్టేజీ వద్ద రూ.33 లక్షలతో నిర్మించిన కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించారు.
అక్కడే రూ.7 లక్షలతో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన రెడ్డి సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.5 లక్షలతో నిర్మించనున్న మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోచమ్మ బోనాల సందర్భంగా గ్రామంలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలతో మాట్లాడుతూ.. వారితో సెల్ఫీలు దిగుతూ సంతోషపరిచారు. రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. అనంతరం 65 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలను అందించే కార్యక్రమాన్ని ఈ సీజన్లో రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రారంభించారు.
రైతుల అభ్యున్నతికి సీఎం కృషి
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్మన్నపేట రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు దాదాపు రూ.17 వేల కోట్లు బీమా సంస్థకు చెల్లించి బీమా అందిస్తున్నట్లు తెలిపారు. వేసవిలోనూ మెట్టప్రాంతంలో నీటి వనరులకు జలకళ రావడం ముఖ్యమంత్రి నిర్మించిన ప్రాజెక్ట్‌ల వల్లేనని ఉద్ఘాటించారు. దాదాపు రూ.మూడు వేల కోట్ల ఆదనపు భారం ప్రభుత్వంపై పడుతున్నా భరిస్తూ యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆదర్శవంతమైన పథకాలను అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణేనని స్పష్టం చేశారు. కరెంట్, నీరు, రైతు బంధు, రైతు బీమా వంటివి ఇతర రాష్ర్టాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు.
ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా సహకరిస్తాం
సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారంతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని వెల్లడించారు. సమాజంలో అన్ని రకాల వ్యక్తులతో కలిసే తత్వం ఆర్యవైశ్యులకు ఉంటుందన్నారు. రాజకీయ నేతలు కులం మతం పేరుతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. శాంతి లేకుంటే అభివృద్ధి ఉండదని వ్యక్తపరిచారు. రాష్ట్రం సాధించక ముందు.. తర్వాత సిరిసిల్ల ఎట్లుండె.. నేడు ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యక్ష్యంగా చూస్తున్నారన్నారు.
పేదరికంలో ఉన్న ఆర్యవైశ్యులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించాలని ఆర్యవైశ్యులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆర్యవైశ్యసంఘం, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ సంఘ భవనాలకు సహకారం అందించాలని కోరగా, అవసరమైన సహకారం అందిస్తానని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కోరుట్లపేటలో ‘డబుల్’ సంబురం
మధ్యాహ్నం 3:05 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలోని కేసీఆర్‌నగర్‌కు చేరుకున్న మంత్రి 16 డబుల్డ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన పండల మోహన్ ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో మృతి చెందగా అతని భార్య పద్మకు సెస్ సంస్థ తరఫున రూ.5 లక్షల చెక్కును ఈ సందర్భంగా మంత్రి అందించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ శివారులో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం, ఎల్లారెడ్డిపేటలో జడ్పీటీసీ కార్యాలయం, హరిదాస్‌నగర్‌లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కోరుట్లపేట డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు.
సిరిసిల్లలో మినీ స్టేడియం, కొత్త చెరువు అభివృద్ధి పనులు ప్రారంభం
సాయంత్రం 4:45 గంటలకు సిరిసిల్లకు చేరుకున్న మంత్రి కేటీఆర్, పట్టణానికి తలమానికంగా రూ.11 కోట్లతో నిర్మించిన కొత్త చెరువు, మినీ ట్యాంక్‌బండ్, సుందరీకరణ పనులను, రాజీవనగర్లో రూ.3 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియంను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. పట్టణంలోని సినారె కళామందిరంలో పోలీస్ నియామక పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఉద్యోగార్థులకు పోటీపరీక్షలపై మార్గనిర్ధేశం చేశారు. పద్మనగర్‌లో ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ప్రారంభించి, బైక్‌ను పరిశీలించారు.
పైసా లంచం లేకుండా ఇండ్లు
ఒక్క పైసా లంచం లేకుండా నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.20 వేల కోట్లతో 2.70 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని తెలిపారు. 560 చదరపు గజాల అడుగుల విస్తీర్ణంలో పేదలకు నాణ్యమైన ఇండ్లు నిర్మించి, ఎలాంటి పైరవీ లేకుండా అర్హులకు అందిస్తున్నామన్నారు. లబ్ధిదారులు బాధ్యతగా పరిశుభ్రతను పాటిస్తూ మొక్కలు నాటి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కోరారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని వినియోగించుకుని పల్లెలు దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నాయని తెలిపారు. సిరిసిల్లలోని మినీ స్టేడియం క్రీడాకారులకు వరంలాంటిదని పేర్కొన్నారు.
భారమైనా వడ్లు కొంటున్నాం
దాదాపు రూ.మూడు వేల కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతున్నా భరిస్తూ యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. రైతులకు 24 గంటల కరెంట్, నీరు, రైతు బంధు, రైతు బీమా వంటివి ఇతర రాష్ర్టాల్లో ఉన్నయా?. పక్క రాష్ర్టాల్లో కరెంటు కోతలతో జనరేటర్లు పెట్టుకోనిదే కిరాణా, జిరాక్స్, జ్యూస్ సెంటర్లు నడిచే పరిస్థితి లేదు. చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పిస్తూ బతుకమ్మ చీరెల ఆర్డర్లతో బతుకులకు భరోసా కల్పించాం. పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. రాష్ట్రం సాధించక ముందు.. తర్వాత సిరిసిల్ల ఎట్లుండె.. నేడు ఎంత అభివృద్ధి చెందిందో ప్రతక్ష్యంగా చూస్తున్నాం. ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు.