కరీంనగర్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇలా 400కుపైగా పథకాలు మన రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనలో దాదాపుగా ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేకుండా.. పార్టీల కతీతంగా అందుతున్నాయి. అందుకే సందర్భం వచ్చిన ప్రతీసారి లబ్ధిదారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఎవరి కోసం వస్తున్నాడని గట్టిగా అడుగుతున్నారు. ‘ఇలాంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా..? ఏ రాష్ట్రంలోనైనా అమలవుతున్నయా..?’ అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఏమైనా చేయాలనుకుంటే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అరిగోస పడుతున్న రైతులకు అండగా నిలువాలని సూచిస్తున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఆది నుంచీ సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా రు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, ఆది నుంచి రాష్ర్టాన్ని ప్రగతి పథంలో పరిగెత్తిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అన్ని వర్గాలకూ పెద్దపీట వేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన చేరువ చేశారు. 400కు పైగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారు. ఆసరా, ఆహారభద్రత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీటూపీజీ, కేసీఆర్‌కిట్ ఇలా ఎన్నో పథకాలను అమల్లోకి తెచ్చారు. సర్కారు దవాఖానల ఆధునికీకరణ, రోడ్లు, భవనాల నిర్మాణం లాంటి వాటితో ప్రగతిని పరుగులు పెట్టించారు. ప్రధానంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, ఎవుసాన్ని పండుగలా మార్చారు. సాగుకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇంకా రైతుబంధు, రైతుబీమా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేసి, బీడు భూములను సస్యశ్యామలం చేశారు.
వట్టిపోయిన ఎస్సారెస్సీకి జీవం పోసి, వరద కాలువను జీవనదిలా మార్చేందుకు ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని తెచ్చారు. గత ఆగస్టులో దళితబంధును తెచ్చి దళితుల తలరాతలు మారుస్తున్నారు. ధాన్యం కొనేదిలేదని కేంద్రం చేతులెత్తేస్తే రూ.3 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ కొనుగోళ్లు చేపట్టారు. కరీంనగర్ అంటే మొదటి నుంచీ ప్రత్యేక ప్రేమ చూపుతూ, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. కరీంనగర్‌కు ఐటీ టవర్‌ను ఇచ్చారు. మానేరు రివర్‌ఫ్రంట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వగా, పనులను కేటీఆర్ రెండు నెలల క్రితమే ప్రారంభించారు. ఇటు యువతీ యువకుల కోసం కొలువుల కుంభమేళాను తెచ్చారు. ఇప్పటికే 17వేలకు పైగా పోలీస్, గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. పార్టీలకతీతంగా సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో 70 శాతం మంది ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందిన వారే ఉన్నారు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఒకరిద్దరు లబ్ధిదారులు కనిపిస్తున్నారు.
గరిష్ఠంగా ఐదారు పథకాల ద్వారా ఐదారుగురు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు వీరంతా తమ ఇళ్లకు పెద్దదిక్కులా నిలుస్తున్న పథకాలతో భరోసాగా ఉన్నారు. ముఖ్యంగా పండుటాకులు, ఒంటరి మహిళలు తమ కాళ్లపై నిలబడుతున్నారు. మేనమామ కట్నం చదివించినట్లు కేసీఆర్ లక్షా నూట పదహార్లు ఇస్తుండడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు సంబురంగా తమ పిల్లలకు పెండ్లిళ్లు చేస్తున్నారు. ఎవుసం పండుగలా మారడంతో రైతులు నిరందీగా ఉన్నారు. బంగారు పంటలు పండిస్తూ దీమాగా ఉన్నారు. కులవృత్తులకు జీవం పోయడంతో అన్ని వర్గాల ప్రజలు సంబురపడుతున్నారు. నోటిఫికేషన్ల విడుదలతో నిరుద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అందుకే సబ్బండవర్గాల ప్రజలు సందర్భం వచ్చిన ప్రతిసారీ టీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. లబ్ధిదారుల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నారు. పార్టీలకతీతంగా.. ఎలాంటి స్వార్థం లేకుండా పథకాలు అందుతుండడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తూ అన్ని వర్గాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడుతున్నారు.
70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యమని, ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా మారిందని, ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైందని ప్రశంసిస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ కాకుండా మరెవరు ఉన్నా ఇంత అభివృద్ధి జరిగేది కాదని, సకల జనులకు సంక్షేమం అందేది కాదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఎవుసం పండుగలా మారిందని, రైతులు అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎవరి కోసం ఇక్కడకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం రాక ముందు పొద్దంతా కరెంటు లేక అర్ధరాత్రి బావుల వద్దకు వెళ్లిన అనేక మంది రైతులు కరెంటు షాక్‌కో, పాము కాటుకో బలయ్యారని, కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో రైతులు అరిగోస పడుతున్నారని, మూడు నాలుగు గంటలైనా కరెంటు రాక.. సాగునీరు అందక.. బోర్లు వేసుకొంటామంటే అనుమతులు రాక.. పండిన పంటను కొనేవాళ్లు లేక.. అమ్మినా గిట్టుబాటు దక్కక కనాకష్టం పడుతున్నారని, వారిని పట్టించుకోకుండా ఇక్కడ ఏం చేయడానికి వస్తున్నారని అడుగుతున్నారు. ‘కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ అన్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు.
నాగమ్మ ఇంటికి సర్కారు భరోసా
ఈమె పేరు గాజుల నాగమ్మ.. భర్త బక్కయ్య అంధుడు. ఇద్దరు కొడుకులు సాగర్, రాకేశ్ కాగా, పెద్ద కొడుకు సాగర్ దివ్యాంగుడు. భర్త పేరున 30 గుంటల భూమి ఉండగా, అందులోనే పంట ఏసుకొని, కూలీ నాలీ జేసుకుంటూ కొడుకులను చదివిస్తున్నది. వారి పై చదువుల కోసం అప్పులు జేసిన్రు. భర్తకు రూ.3 వేలు, పెద్ద కొడుక్కు రూ.3 వేల చొప్పున వచ్చిన ఆసరా పింఛన్‌తో ఇల్లు గడిపేది. ఇంతలోనే రెండు నెలల కిందట భర్త బక్కయ్య గుండెపోటుతో మరణించిండు. దీంతో నాగమ్మకు కుటుంబ పోషణ కష్టమైంది. వారి బతుకులు రోడ్డు మీదపడ్తయని ఆందోళన చెందారు. సరిగా నడువలేని పెద్ద కొడుకు, లోకం తెలువని చిన్న కొడుకును ఎట్లా సాదాలని, అప్పులు ఎలా తీర్చాలని రంది పడ్డది. ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతుబీమా పథకం కింద రూ.5 లక్షల చెక్కు మంజూరైంది. బక్కయ్య చనిపోయిన వారం రోజులకే కుటుంబ సభ్యులకు అందింది. ఇందులో కొంత అప్పులు కటి, మరికొంత కొడుకుల చదువు కోసం ఖర్చు చేసింది. మిగిలిన డబ్బులతో కొంచెం భూమి కొనుకున్నది. ఏ దిక్కులేని తమ కుటుంబానికి సీఎం కేసీఆరే పెద్ద దిక్కై వారి బతుకులకు భరోసా ఇచ్చాడని, తాము బతికున్నంత కాలం ఆయన వెంటే ఉంటామని నాగమ్మ స్పష్టం చేస్తున్నది.
చేతగాని కాంగ్రెస్ పాలన యాదికస్తేనే దుఃఖమస్తది
మా రైతులం ఇప్పుడే మంచిగున్నం. కేసీఆర్ పుణ్యమాని రంది లేకుంట బతుకుతున్నం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి.. పోయినయిగానీ కాంగ్రెస్ అసోంటి చేతగాని సర్కారును మేం చూడలే. వారి పాలన యాదికస్తేనే దుఃఖమస్తది. మా గోస తగిలే రాష్ట్రంలో ఆ పార్టీ మట్టిల కొట్టుకుపోయింది. రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన ఆ పార్టీ నీళ్లిచ్చిందా..? కరెంట్ ఇచ్చిందా..? ఎరువులు, విత్తనాలు ఇచ్చిందా..? మాకు ఏం ఇయ్యలే. ఎటు చూసినా కష్టాలే. ఏ ఆశ లేదు. బతుకుమీదే విరక్తి పుడుతుంటే. నాకు ఊళ్లె పదెకరాల భూమి ఉంది. నీళ్లు లేక సగానికి మీదనే పడావు పెట్టెటోన్ని. నీళ్లుంటే కరెంట్ ఉండది. వచ్చినా అందరూ పండే యాళ్లకు రాత్రి 9, 10 గంటలకు ఇస్తుండే.
రాత్రి లైట్లు పట్టుకొని భూమికాడికి పోయేది. ఇగ సీజన్ల ఎరువులు, విత్తనాల కోసం కొట్లాటలే నడుస్తుండే. ఓటి దొరికితే ఇంకోటి దొరికేది కాదు. ఎవుసం చేయాలంటేనే ఏడుపచ్చేది. తెలంగాణ ఎప్పుడైతే వచ్చి.. కేసీఆర్ సీఎం అయ్యిండో మా కష్టమంతా పోయింది. ఒకటి తర్వాత ఒకటి అన్నీ సౌలతులు అందినయి. నీళ్లు, కరెంట్, ఎరువులు, విత్తనాల బాధ లేకుంట పోయింది. పెట్టుబడికి పైసలు ఇస్తండు. నాకు పసలుకు రూ.50 వేల దాకా వస్తున్నయ్. మొన్నటికి మొన్న బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనమని అంటే కేసీఆర్ సారే కొనవట్టే. ఇట్ల ఎవరు చేస్తరు. ఇంతకు ముందు ఏ ప్రభుత్వంతో కాలె. ఇకముందూ కూడా ఎవరితో కాదు. అది ఒక్క కేసీఆర్ సారుతోనే సాధ్యమైతది. సార్‌ను రైతులం గుండెల్లో పెట్టుకుంటున్నం.
– కందుల సదాశివ్, రైతు, కనగర్తి (ఓదెల)
ఇద్దరు బిడ్డలకు కల్యాణలక్ష్మి
నేను జమ్మికుంటలో టూ వీలర్ మోకానిక్‌గా పని చేస్తున్న. మాకు ఎవుసం భూమి లేదు. నా భార్య రజిత కూలీ పని చేస్తంది. మాకు ఇద్దరు బిడ్డలు. వాళ్లను డిగ్రీ దాకా చదివించిన. పెద్ద బిడ్డ సాహిత్య పెళ్లి 2019ల చేసిన. రెండో బిడ్డ సాయి శరణ్య పెళ్లి ఈ మధ్యనే 2021ల చేసిన. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లకు సీఎం సార్ చెరొక రూ.లక్షా నూట పదహార్ల చెక్కులు పంపిండు. నా బిడ్డల పెండ్లిళ్లకు సాయం చేసిండు. ఈ పైసలను పెండ్లిళ్ల ఖర్చులు కట్టుకున్న. నాలాంటి పేదోళ్లకు ఇది గొప్పసాయం. ఇంతకు ముందు ఇలా సాయం చేసిన ముఖ్యమంత్రిని చూడలే. మమ్మల్ని ఆదుకున్న కేసీఆర్ సార్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటం.
– ఉమ్మడి రవి, మాచనపల్లి (జమ్మికుంట రూరల్)
అన్నివర్గాలకు మేలైతంది..
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంగా మారింది. నేను కాంగ్రెస్ లీడర్‌ను. ఇటీవలే నా కూతురు పెండ్లిచేసిన. పార్టీల కతీతంగా కల్యాణలక్ష్మి చెక్కు అందింది. ఆ డబ్బులతో నా అప్పు తీరింది. ఒకప్పుడు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే కష్టంగా ఉండేది. కానీ కల్యాణ లక్ష్మి పథకం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటున్నరు. రందిలేకుంట బతుకుతున్నరు. నేను కాంగ్రెస్‌లో పనిచేస్తున్నప్పటికీ టీఆర్ఎస్ సర్కారు పనితీరును మెచ్చుకోవాల్సిందే. సర్కారులో అన్నివర్గాలకు మేలు జరుగుతుంది.
–సాదినేని మల్లయ్య, కొండపల్కల (మానకొండూర్ రూరల్)
‘ఆసరా’తోనే కనుకవ్వ బతుకు
ఇక్కడ కనిపిస్తున్న అవ్వ పేరు కనుకవ్వ. ఊరు హుజూరాబాద్‌లోని ఇప్పల్‌నర్సింగాపూర్. తన 25వ ఏటనే తల్లిదండ్రులను కోల్పోయింది. పెండ్లయిన కొన్నాళ్లకే భర్త వదిలిపెట్టాడు. అప్పటినుంచి ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. కనీసం తలదాచుకునేందుకూ నిలువ నీడలేదు. చేద్దామంటే ఏ పని చేతకాక.. బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా ఎవరూలేని దీనగాథ ఆమెది. ప్రభుత్వాలు ఎన్నిమారినా తీరని బాధ ఆమెది. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక ఆమె తలరాత మారింది. ఆసరా పింఛన్ వెలుగు రేఖగా నిలిచింది. మొదట్లో రూ. వెయ్యి, ఆ తర్వాత 2018 నుంచి రూ.2వేలు ఒంటరి మహిళ పింఛన్ అందుకుంటూ రంది లేకుండా బతుకుతున్నది. పింఛనేకాదు ప్రతి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఇచ్చే చీరను ఎంతో మురిపెంగా తీసుకుంటుంది. “ఎంతో మంది నాయకులు వచ్చిన్రు.. పోయిన్రు గానీ మాసోంటోళ్ల గోడును పట్టించుకోలేదని, కేసీఆర్ సారు వచ్చిన తర్వాతనే మాకు ఆసరా దొరికింది. సారు ఇచ్చే పింఛన్ లేకుంటే నా బతుకు ఎప్పుడో తెల్లారిపోయేది. నా లాంటి వాళ్లకు ఆయన దేవుడు’ అంటూ కనుకవ్వ ఆనందబాష్పాలు రాలుస్తూ చెప్పింది.
– హుజూరాబాద్
నాటి కాంగ్రెస్ పాలన..
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనలో ప్రజలకు, రైతులకు చేసింది అంతంతే. పథకాల అమలూ గోరంతే. ప్రధానంగా ఎవుసం దండగలా మారింది. అన్నదాతకు ప్రోత్సాహం లేక కాడిని వదిలేయాల్సిన దుస్థితి వచ్చింది. సీజన్లో ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కని రోజు లేదు. రోజులో కరెంట్ నాలుగైదు గంటలు సక్రమంగా ఇచ్చింది లేదు. నీళ్లు లేక చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండుతున్నా పట్టించుకున్న దిక్కు లేదు. అప్పుల కుప్ప పెరిగి వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నా.. పాలకులు కన్నెత్తి చూసింది లేదు.
నేటి టీఆర్ఎస్ పాలన..
ఏనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్, ఆది నుంచీ సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో పథకాలను తెచ్చి, విజయవంతంగా అమలు చేస్తున్నది. దాదాపుగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తూ ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరుస్తున్నది. ప్రధానంగా విత్తనం మొదలు ప్రతిగింజా కొనేవరకు ప్రతి దశలోనూ అండగా నిలుస్తూ ఎవుసాన్ని పండుగలా మార్చింది. ఇటు పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తూ.. ఇతర పార్టీల నేతల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది.
కాంగ్రెస్ నేత ఇంట.. పథకాల పంట..
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జూకొంటి మల్లేశం. ఊరు కోనరావుపేట మండలం మామిడిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇతనికి గ్రామంలో ఎకరన్నర భూమి ఉన్నది. ఎవుసమే ఆయనకు బతుకుదెరువు. ఒకప్పుడు నీళ్లు లేక, కరెంట్ లేక చానా ఇబ్బందులు పడ్డడు. కానీ, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు అర్హత ఉన్న ప్రతి పథకంతో ప్రయోజనం పొందాడు. రైతు బంధు కింద ఏడాదికి రూ.14వేలు తీసుకుంటున్నడు. పెట్టుబడి ఖర్చులు ఎల్లదీసుకుంటున్నడు. ఇంకా ఈ మధ్యే కూతురు పెండ్లి కూడా చేసి, కల్యాణలక్ష్మి సాయం కింద రూ.1,00,116 అందుకున్నడు. గొర్రెల పంపిణీ పథకంలోనూ లబ్ధిపొందాడు. మొదటి విడతలో ఒక యూనిట్ (21 గొర్రెలు) తీసుకున్నడు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన రుణం ద్వారా రూ.70వేల విలువైన బర్రెను కొనుగోలు చేశాడు. రోజూ పాల విక్రయం ద్వారా ఆదాయం పొందుతున్నడు. అనారోగ్యంతో ఆ బర్రె చనిపోతే ఇన్సూరెన్స్ ద్వారా ప్రభుత్వమే మరొకటి కొనిచ్చింది. ఇలా అనేక పథకాలతో ప్రయోజనం పొందుతూ దర్జాగా బతుకుతున్నడు. ఇలా తనకే కాదు ఎంతో మందికి మేలైతున్నదని మల్లేశం సంతోషంగా చెబుతున్నాడు.