ముకరంపుర, మే 5: కరీంనగర్‌లోని పండ్ల మార్కెట్ కళకళలాడుతున్నది. మధుర ఫలం మామిడి క్రయవిక్రయాలతో ఫీజు రూపంలో మంచి ఆదాయాన్ని పొందుతున్నది. రైతులు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపారులతో సందడి కనిపిస్తుండగా, నిత్యం ఉదయం నుంచీ రాత్రిదాకా టన్నుల కొద్ది కొనుగోళ్లు, అమ్మకాలతో రద్దీగా మారిపోయింది. మార్కెట్‌కు వచ్చే కర్షకులు, ఖరీదు దారులకు ఎక్కడా ఇబ్బందుల్లేకుండా యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని పండ్ల మార్కెట్ మామిడి కొనుగోళ్లతో కళకళలాడుతున్నది. స్థానిక కమీషన్ ఏజెంట్లతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ఖరీదుదారులతో నిత్యం రద్దీగా కనిపిస్తున్నది. జిల్లాలో ఏడువేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండడం, ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోట ల ఏర్పాటుకు చేయూతనందిస్తుండడంతో ఏటికేడు మామిడి తోటల విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ క్రమంలో అన్నదాతలు ఆధునిక సాగు విధానా లు, సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే దీనికి తగ్గట్టు గా ప్రభుత్వం పండ్ల మార్కెట్ల విస్తరణకు చర్యలు చేపట్టడం సత్ఫలితాలనిస్తున్నది. జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులోని పండ్ల మార్కెట్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దడంతో వేలాది మంది రైతులకు మేలు చేకూరుతున్నది.
పారదర్శకంగా కొనుగోళ్లు
మామిడి మార్కెట్లో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా పాలకవర్గం, అధికారులు చర్యలు చేపట్టారు. రైతు మామిడి లోడుతో మార్కెట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వెళ్లేదాక ఇబ్బంది లేకుండా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వాహనాల వివరాలను నమోదు చేస్తున్నారు. ప్రత్యేకంగా మెయిన్ గేట్ నుంచి మొదలుకుని మార్కెట్లోని పలు చోట్ల సీసీ కెమెరాలను బిగించారు. రైతులకు మంచి ధర లభించేలా బహిరంగ వేలం పాట ద్వారా బిడ్డింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరుగుతున్నది. ఎక్కువ ధర చెల్లించే వ్యాపారులకే రైతులు కాయలు విక్రయించుకోవచ్చు. కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులు రైతులందరికీ తప్పని సరిగా తక్‌పట్టీలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. దీంతో నగదు చెల్లింపుల్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొనుగోళ్ల వివరాలన్నీ రికార్డుల్లో నమోదై మార్కెట్‌కు ఆదాయం సమకూరుతుంది. తూకంలో మోసం లేకుండా యార్డులోనే వేబ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు.
అందుబాటులో అన్ని సౌకర్యాలు
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని పండ్ల మార్కెట్ సుమారు ఐదెకరాల్లో విస్తరించి ఉంది. కొనుగోళ్లకు వీలుగా విశాలమైన షెడ్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మామిడి కొనుగోళ్లు జరుగుతుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి మామిడి కాయల లోడుతో వచ్చే రైతులతో పాటు ఎగుమతి దారులు తమ వాహనాలు నిలిపి ఉంచేలా విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పించారు. వ్యాపారులు కొనుగోలు చేసిన మామిడి కాయల గ్రేడింగ్ కోసం ప్రత్యేకంగా షెడ్లను కేటాయించారు. రాత్రి వేళ కొనుగోళ్లు జరుగుతున్నందున రైతుల కోసం విశ్రాంతి భవనాన్ని కేటాయించారు. తాగునీటితో పాటు మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
రైతులకు మేలు చేయడమే లక్ష్యం..
రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాతున్నాం. పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చూస్తున్నాం. మార్కెట్ నిర్వహణలో సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. వ్యాపారులు ప్లాస్టిక్ వాడకుండా, మామిడి కాయల ప్యాకింగ్‌లో కార్బైడ్ వాడకుండా నిఘా ఉంచాం.
– ఎలుక అనిత-ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్
పారదర్శకంగా కొనుగోళ్లు
మామిడి మార్కెట్లో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్పట్టీపైనే కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నాం. అన్ని సౌకర్యాలు ఉండడంతో పలు మండలాల నుంచి రైతులు తరలివస్తున్నారు.
– పురుషోత్తం, ఉన్నత శ్రేణి కార్యదర్శి