జగిత్యాల విద్యానగర్, మే 5:ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచే మొదలు కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనుండగా, ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. జిల్లాలో మొత్తం 30,927 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, యంత్రాంగం 51 కేంద్రాలను ఏర్పాటు చేసింది. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు సెంటర్లపై నిఘా పెట్టింది. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించరని, అరగంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు సూచించింది.
జిల్లాలో శుక్రవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు సీఎస్, అడిషనల్ సీఎస్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్‌స్కాడ్, సిట్టింగ్ స్కా డ్లను నియమించారు. పరీక్షాకేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పోలీస్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షలకు17,852మంది విద్యార్థులు
జిల్లాలో 30పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8,945మంది ప్రథమ, 8,907 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీతో పాటు 30మంది సీఎస్‌లు, 30మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 14 మంది అదనపు సీఎస్‌లు, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్లు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లు, 375మంది ఇన్విజిలేటర్లతో పాటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏఎన్ఎంలు సైతం విధులు నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు అన్ని వసతులు, ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల లొకేటెడ్ యాప్‌ను సైతం అం దుబాటులోకి తీసుకువచ్చారు. పరీక్షలు ఉద యం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కొనసాగనున్నాయి. నిమిషం లేటైనా కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్‌విద్య జిల్లా నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిపై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య పనులు
మెట్పల్లి టౌన్, మే 5: పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గురువారం పారిశుధ్య పనులు చేయించారు. కేంద్రాల్లో స్వీపింగ్ చేయించి ట్రాక్టర్ ద్వారా చెత్తను తరలించినట్లు తెలిపారు. హైపోక్లోరైట్‌ను స్ప్రే చేయించినట్లు పేర్కొన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డి, ముజీబ్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.