సిరిసిల్ల రూరల్, మే 5: కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని కడతేర్చేందుకు తండ్రి కుట్రపన్నాడు. రూ. 5లక్షల సుపారీ ఇచ్చి హతమార్చేందుకు ముగ్గురితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గురువారం ఉదయం 6 గంటలకు నలుగురు ఒకచోట కలుసుకున్నారు. యువకుడిని హత్య చేసేందుకు సినీఫక్కిలో పథకాన్ని రూపొందించారు. అందులో ఇద్దరు కారులో కత్తులతో వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ బస్టాండ్‌కు చేరుకున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి కోసం వేచిచూస్తున్నారు. సీన్‌కట్ చేస్తే.. వీరికి పోలీసులు తారసపడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే జిల్లా పోలీసు కార్యాలయం లో వివరాలు వెల్లడించారు. వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్‌కు చెందిన నీలం శ్రీనివాస్ కూతురు శిరీష, వేములవాడలోని సుభాష్‌నగర్‌కు చెందిన మనోజ్‌కుమార్ మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే తల్లిదండ్రులు శిరీషను గత నెల డిసెంబర్లో మరోవ్యక్తితో పెళ్లిచేశారు. పెండ్లయిన వారానికే శిరీష ప్రియుడుతో కలిసి పారిపోయింది. కొంతకాలం ముంబైలో ఉండి తిరిగి వేములవాడకు చేరుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీలు పెట్టినా శిరీష, మనోజ్ ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో శీరిష తండ్రి నీలం శ్రీనివాస్ మనోజ్‌కుమార్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదేగ్రామానికి చెందిన తన స్నేహితుడు మనుక కుంటయ్యను సంప్రదించాడు. వీరిద్దరు జిగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బొమ్మిడి రాజ్‌కుమార్‌తో చర్చించారు. వీరు ముగ్గురు కలిసి బిహార్‌కు చెందిన లకింద్ర సాహ్నిని సంప్రదించారు. మనోజ్‌ను హతమారిస్తే రూ. 5లక్షల సుపారీ ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.
ఈ మేరకు రాజ్‌కుమార్, లిఖింద్ర సాహ్నితో కలిసి కుంటయ్య కారులో మనోజ్‌ను కడతేర్చేందుకు రెండు పెద్ద కత్తులు తీసుకుని వేములవాడకు వచ్చారు. ఉదయం 6 గంటలకు శ్రీనివాస్, కుంటయ్య తిప్పాపూర్ బస్టాండ్ వద్ద వీరిని కలిశారు. అక్కడి నుంచి బతుకమ్మ తెప్ప వద్దకు వచ్చి కాపుకాశారు. మనోజ్‌కుమార్ రోజు మాదిరిగానే మార్కెట్‌కు వచ్చాడు. చంపేందుకు సిద్ధమవుతుండగా వేములవాడ-2 ఠాణాకు చెందిన పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేయగా కత్తులు దొరికాయి.
వెంటనే వారిని అదుపులోకి విచారించంగా హత్యకుట్ర బట్టబలైంది. వీరిలో కుంటయ్య మాజీ నక్సలైట్ అని, గతంలో పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడని పేర్కొన్నారు. నిందితుల నుంచి కారు, రెండు పెద్ద కత్తులు,4 సెల్ఫోన్లు,బైక్, బాధితుడి ఫొటో, రూ.5వేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి,రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన వేములవాడ పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, సీఐ వెంకటేశ్, ఎస్ఐలు ఉన్నారు.