రాజన్న సిరిసిల్ల, మే 4 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్లటౌన్/ ఎల్లారెడ్డిపేట : “దళితులు సాధికారత, స్వావలంబన సాధించి కూలీల నుంచి సక్సెస్ ఫుల్ ఓనర్లుగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. అందులో భాగంగానే దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని విధంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. లబ్ధిదారులు రైస్‌మిల్లులు, పెట్రోల్ బంకులు వంటి పరిశ్రమలు స్థాపించుకోవడం శుభపరిణామం” అని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో దళితబంధు పథకం కింద రైసుమిల్లు, హరిదాస్‌నగర్‌లో పెట్రోలు బంక్ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం సిరిసిల్లకు చేరుకుని సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) కార్యాలయంలో నూతన పాలకవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని దళితులు కూలీల నుంచి ఓనర్లుగా, వ్యాపారవేత్తలుగా మారాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. అరవై ఏళ్లుగా దళితుల కో సం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో అత్యధిక మంది అట్టడుగునే ఉన్నారని తెలిపారు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండానే నేరుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించే పథకం తెలంగాణలో తప్ప మరెక్కడా లేదని గుర్తు చేశారు. దళితబంధు పథకంలో భాగంగా చాలా జిల్లాల్లో వాహనాలు కొనుగోలు చేస్తే, రా జన్న సిరిసిల్ల జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. వీటిద్వారా ఆ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది పదిమందికి ఆదర్శంగా నిలువాలని పిలుపు నిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు.
దళితబంధు ఓట్ల కోసం కాదు
వందలు, వేల గంటల మేధోమథనం, మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత దళితుల అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. శతాబ్ధాలుగా సామాజిక వివక్షతకు, అణచివేతకు గురవుతున్న దళితులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు.
అభినందించాలే గానీ అడ్డగోలు వాదనలెందుకు?
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అభినందించాలే గానీ అడ్డగోలు వాదనలేంటని ప్రతిపక్ష బీజీపీని ప్రశ్నించారు. కోదండరాముని ఆల యం గుట్ట ఎక్కినప్పుడు స్థానిక నాయకులు తమ గ్రామంలో జరిగిన బ్రిడ్జికింద చెక్‌డ్యాం, శ్మశానవాటిక, డంప్‌యార్డు, విద్యుద్దీపాలు, సీసీ రోడ్లు, గోడౌన్ చూపుతూ గర్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెబుతుంటే సంతోషమనిపించిందని అన్నారు. కానీ, కొందరు ముఖ్యమంత్రి కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏదిపడితే అది మాట్లాడుతున్నారనీ, అసలు కేసీఆరే లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ అనేవి ఉండేవా? వాటికి చీఫ్‌లు ఉండేవారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ కాలిగోటికి సరిపోని నాయకులు ఎగిరెగిరి పడి మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామంలో చేసిన అభివృద్ధిలో తమ పైసలే ఉన్నాయని అడ్డగోలుగా మాట్లాడే బీజేపీ నాయకులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణాలో చేసిన పను లు చూపించగలరా? అని ప్రశ్నించారు. నిజంగా వారు చెప్పినట్లు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని అం టే ఆయా రాష్ర్టాల్లో శ్మశానవాటికలు, డంప్‌యార్డులు, ఇంకుడు గుంతలు, రైతువేదికలు, గో దాములు, ఇంటింటికీ నీరు, రైతుబంధు చూపించగలరా? అని నిలదీశారు. దేవుళ్లను మొక్కడం బీజేపీ వాళ్లే నేర్పించిన తీరుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
దేవుళ్ల పేరు చెప్పి పబ్బం గడిపే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బండలింగంపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని, సబ్‌స్టేషన్‌ను మం జూరు చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నదనీ, భవిష్యత్తు తరానికి మంచి చేసే ఒక విద్యాయజ్ఞమే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమమని చెప్పారు. గతంలో ఎంఈవోగా పనిచేసిన మంకు రాజయ్య సూచనతో విద్యావలంటీర్లను పెట్టుకునేందుకు తన వంతు సాయం అందించానని, అప్పుడు కేవలం మండలం వరకే ఉన్న యజ్ఞాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతున్నామని తెలిపారు.
కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతులకు లోటు లేకుండా అన్నీ నిర్మించుకుందామని చెప్పారు. కరోనా చెప్పిన పాఠం గుర్తు చేస్తూ ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతి గదిని ఏర్పాటు చేసి ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దే వాతావరణం కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 973 గురుకుల పాఠశాల్లో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలకు నాణ్యమైన చదువు అందించేందుకు ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మద్ద పీరీల మజీద్ వద్దకు తీసుకెళ్లి దానికి ప్రారంభోత్సవం చేసుకున్నారు.
అక్కడ నుంచి సీతారామస్వామి ఆలయానికి చేరుకుని మొక్కలు చెల్లించుకున్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ అనురాగ్‌జయంతి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఈవో రాధాకిషన్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చి క్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్ఎస్ బీసీ సెల్ నాయకుడు బొల్లి రాంమోహన్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
బాధ్యతతో పనిచేయాలి
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం పాలకవర్గ సభ్యులు బాధ్యతతో పని చేసి వినియోగదారుల మన్ననలు పొందాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సెస్ చైర్మన్‌గా గూడూరి ప్రవీణ్‌తోపాటు ఆయా మండలాల డైరెక్టర్లు మంత్రి కేటీఆర్ సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టగా, సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూలుదండతో గూడూ రి ప్రవీణ్‌ను సన్మానించి అభినందించారు. సహకార రంగంలోనే సెస్‌కు మంచి గుర్తింపు కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యు లు బాధ్యతతో పని చేసి సంస్థ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు.