కోనరావుపేట, మే 4;మండలంలోని ధర్మారంలో సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ చొరవతో 1.36 కోట్లు మంజూరుకాగా, చకచకా పనులు పూర్తి చేయడంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇకనుంచి మల్కపేట, ధర్మారం గ్రామాల్లో కరెంట్ తిప్పలు తప్పనుండగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. అడిగిన వెంటనే నిధులిచ్చి కరెంట్ సమస్యను పరిష్కరించిన సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నది.
గతంలో సరిపడినన్ని సబ్స్టేషన్లు లేక పల్లె ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. కరెంట్ ఎప్పుడు వస్త్తుందో ఎప్పుడు పో తుందో తెలియక అనేక ఇక్కట్లకు గురయ్యారు. వేసిన పం టలకు భరోసాలేక దిగులుపడేవారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి మూడు గ్రామాలకు ఒక సబ్‌స్టేషన్ నిర్మించాలని సంకల్పించింది. ఇదేకోవలో ధర్మారం, మల్కపేట వాసుల కరెంట్ కష్టాలను తీర్చే లక్ష్యంతో ధర్మారంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఉపక్రమించింది. గడువులోగా పనులు పూర్తిచేసి అందుబాటులో తెచ్చింది.
ఇకపై నిరంతర విద్యుత్..
ధర్మారంలో సబ్‌స్టేషన్ లేకపోవడంతో నిజామాబాద్, మర్తనపేట గ్రామాల్లో ఉండే సబ్స్టేషన్లపై భారం పడేది. దీంతో మర్తనపేట, నాగారం, కొలనూర్, రాజన్నగొల్లపల్లి, నిజామాబాద్, కనగర్తి గ్రామాల్లోని ట్రాన్స్ఫార్మర్లపై లోడు ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడేది. ఈ క్రమంలో మూడు గ్రామాలకు కలిపి 33/ 11కేవీ సబ్‌స్టేషన్ నిర్మించడంతో భారం తగ్గనున్నది. దీంతో సుమారు 3వేలకు పైగా కనెక్షలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. ఇందులో సుమారు 1800కు పైగా గృహ, 1200కు పైగా వ్యవసాయ కనెక్షన్లకు లోవోల్టేజీ సమస్య పరిష్కారం కానున్నది. ఈ సబ్‌స్టేషన్ ప్రారంభం కానుండడంతో తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.