కార్పొరేషన్, ఆగస్టు 22: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ వై సునీల్‌రావు కోరారు. నగరంలోని 60వ డివిజన్ ముకరంపురలో ఆదివారం ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్ దరి చేరకుండా చూసుకోవాలని సూచించారు. కరోనా థర్డ్‌వేవ్, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా రాకుండా మాసు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. దోమలు పెరుగకుండా చూసుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో తొట్టీలు, మట్టి పాత్రలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. కాలనీల్లో మురుగు నీరు నిలిచి ఉంటే తొలగించాలని సూచించారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ క్రాంతి, కార్పొరేటర్ అఖీల్ ఫిరోజ్, డీఎంహెచ్‌వో జువేరియా, డీఎంవో రాజగోపాల్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్, మెప్మా సీవోలు సునీత, దీప, సిబ్బంది పాల్గొన్నారు.