కార్పొరేషన్, ఏప్రిల్ 30: ఆడబిడ్డలు నవ్వాలని, వారు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి సహా అనేక పథకాలను తీసుకువచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ లబ్ధిదారులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 591 మందికి రూ.5.92 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేసి, మాట్లాడారు. మహిళా సంక్షేమమే రాష్ట్ర సర్కారు లక్ష్యమన్నారు. ఆడబిడ్డల పెండ్లి చేసేందుకు పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడవద్దని సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చారని, మేనమామ కట్నం కింద రూ.లక్ష సాయం అందిస్తున్నారని చెప్పారు.
అంతేకాకుండా మహిళల ప్రసూతి కోసం దవాఖానలను ఆధునీకరించారని, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ.12వేలతోపాటు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్న ఘనత దేశంలో ఒక్క టీఆర్ఎస్ సర్కారుదేనని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి ఒక్క పథకమైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంత మంచి పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలందరూ దీవించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఎంతో ఆసగా నిలుస్తుంది
కూలి పని చేసుకొని బతికే మాసోంటోళ్లకు ఈ పథకం ఎంతో ఆసరైతది. కూతురు పెండ్లికి అప్పుల పాలు కాకుండా చేసింది. ఇంత గొప్ప పథకం తెచ్చి, రూ.లక్షాపదహార్లు ఇస్తున్న సీఎం కేసీఆర్ నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. సారు ఇచ్చిన పైసలతో అప్పులేకుంటైంది. చానా సంతోషం.
– పద్మ, ధోబివాడ, కరీంనగర్
ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తం..
వ్యవసాయం చేసుకొని జీవించే మాకు రూ.లక్ష అందించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం. పేదల మేలు కోరే ప్రభుత్వానికి ఎప్పటికీ మద్దతుగా నిలుస్తాం. కేసీఆర్ సర్కారు వచ్చిన తర్వాత అందరికీ మేలైతంది. అంతకుముందు ఎవరూ ఇసొంటి పథకాలు తేలే. పనులు చేయలే.
– కొమురమ్మ, సప్తగిరికాలనీ