కరీంనగర్, ఎప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉద్యమ సయంలోనే కాదు.. స్వరాష్ట్రం సాధించిన తర్వాత ఎన్నికలేవైనా సరే.. ఉమ్మడి జిల్లా ప్రజలు గులాబీ పార్టీని గండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. అసెంబ్లీ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు.. అదే పంథా కొనసాగుతోంది. అందులోనూ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 51.47 శాతం ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ఇతర పార్టీలను కంగు తినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా.. ప్రజల ఓటింగ్ శాతం టీఆర్ఎస్కు పెరుగుతూ రాగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం డీలా పడుతూ వచ్చాయి. అందులోనూ కమలం పార్టీ పూర్తిగా కనుమరుగవుతూ వచ్చింది. అంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, పాలనాదక్షతకు ప్రజలు కడుతున్న పట్టంగా చెప్పవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా.. గత ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ వివిరాలు ఇలా ఉన్నాయి.
రికార్డు స్థాయిలో ఓట్లు
ఆది నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగించింది. గత చరిత్రలో ఏ పార్టీకి రానంత స్థాయిలో ప్రజలు ఓట్ల వర్షం కురిపించారు. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే మూడు శాతం ఓట్లు అధికంగా రావడం గులాబీ పార్టీకి ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతుందని చెప్పడానికి నిదర్శనం. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. 2014 ఎన్నికల్లో జగిత్యాల మినహా.. మిగిలిన 12 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి 9,88,871(48.40) శాతం ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 13 నియోకవర్గాల్లో టీఆర్ఎస్కు 11,41,618(51.47శాతం) ఓట్లు వచ్చాయి. 2014తో పోల్చి చూస్తే అదనంగా 1,52,747 ఓట్లు పెరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలో అసెంబ్లీ ఏన్నికల్లో ఏ పార్టీకి కూడా 47 శాతం మించి ఓట్లు రాలేదు. కానీ, టీఆర్ఎస్ మాత్రం 2018 ఎన్నికల్లో 51.47 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకొని రికార్డు సృష్టించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 22,17,710 ఓట్లు పోలు కాగా అందులో టీఆర్ఎస్కు 11,41,618, మహాకూటమికి 7,02,803, భారతీయ జనతా పార్టీకి 1,40,708 ఓట్లు వచ్చాయి. కాగా, పదమూడు నియోజకవర్గాల్లో కలిపి ఇతరులకు 2,32,581 ఓట్లు వచ్చాయి.