శంకరపట్నం, ఏప్రిల్ 26: కార్యకర్తలకు టీఆర్ఎస్ కొండంత అండగా ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన సముద్రాల పద్మ అనే టీఆర్ఎస్ కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్టీ తరఫున బీమా సొమ్ము రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. కాగా, మంగళవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మృతురాలి ఇంటికి వెళ్లి ఆమె భర్త సముద్రాల కనకయ్యకు బీమా చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీతో ప్రజలకు విడదీయరాని బంధం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటి రెప్పలా కాపాడుకుంటుందని ఉద్గాటించారు.
తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్కు పట్టం కట్టి రెండుసార్లు కేసీఆర్‌కు సీఎం పదవి కట్టబెట్టి గౌరవించడం ప్రజలకు పార్టీ పట్ల ఉన్న ఆదరణకు నిదర్శనం అన్నారు. బుధవారం టీఆర్ఎస్ ఆవిర్భావం దినోత్సవం పండుగలా జరుపుకోవాలన్నారు. గ్రామ గ్రామాన గులాబీ జెండాలు ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచులు ఫోరం మండలాధ్యక్షుడు సంజీవరెడ్డి, సర్పంచులు ముంజ వసంత, భద్రయ్య, రాజయ్య, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖాజాపాష, ఉప సర్పంచ్ మడ్డి రవి, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశం, నందిరెడ్డి, ఆదిత్య, బీ సంపత్, మొలుగూరి శ్రీనివాస్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.