జమ్మికుంట, ఏప్రిల్ 26: ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలా చేయాలని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, సేవ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ పిలుపునిచ్చారు. సేంద్రియ సాగు ఒక పంటతోనే కాదని, విత్తన మార్పుతో మొదలు పెట్టాలని సూచించారు. సాగుకు పూర్వ వైభవం తేవాలని, రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ‘కిసాన్ మేళా’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్‌రామ్, డీఏవో శ్రీధర్ హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు, శాస్త్రవేత్తలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌రామ్ మాట్లాడారు. రసాయనాలతో నేలతల్లి విషతుల్యమవుతుందన్నారు.
ఇప్పటికైనా ప్రతి రైతు సేంద్రియ సాగు దిశగా సాగాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధ్యమని తెలిపారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రకృతి సాగు ఇంటి పంటలతో మొదలు పెట్టాలని పేర్కొన్నారు. రైతులు హైబ్రిడ్ పంటల వైపు చూడకూడదని, బ్రీడ్‌లతో ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. పశు సంపదను పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి సాగు చేయాలనుకునే రైతులు మమ్మల్ని సంప్రదించాలని, ఉచితంగా అవగాహన కల్పిస్తూ.. విత్తనాలను అందిస్తామని చెప్పారు. మా దగ్గర పండే పంటలను తినడం వల్ల ఉన్న రోగాలు నయమవుతాయని, కొత్త రోగాలు రావని తెలిపారు. తర్వాత శాస్త్రవేత్తలు, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ప్రతి రైతు అందిపుచ్చుకోవాలని డీఏవో శ్రీధర్ చెప్పారు.
అనంతరం విజయ్రామ్తో పాటూ సేంద్రియ సాగు చేస్తున్న పలువురు ఉత్తమ రైతులను సన్మానించారు. అంతకుముందు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కిసాన్ మేళాను ప్రారంభించి, ప్రకృతి సాగుపై అందించిన సందేశాన్ని లైవ్ ప్రోగ్రామ్‌ను ప్రొజెక్టర్ ద్వారా ప్రసారం చేశారు. కేవీకే ఫౌండర్, మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్‌రెడ్డి ఇటీవల మృతి చెందగా, ఆయనకు నివాళులర్పించారు. కేవీకే ప్రధాన కార్యదర్శి విజయగోపాల్రెడ్డి, శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, మహేశ్, ప్రభాకర్, ప్రశాంతి, రవిశంకర్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.