జగిత్యాల, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ 21వ ప్లీనరీని పండుగలా నిర్వహించాలని గులాబీ శ్రేణులకు టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎం సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఉద్యమించి, 14 ఏండ్ల సుదీర్ఘపోరాటం తర్వాత తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ మార్చేందుకు, అభివృద్ధి, సంక్షేమాలకు కేరాఫ్‌గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషిచేస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరపాలని శ్రేణులకు సూచించారు. ప్రతి మండలం.. ప్రతి వీధిలోనూ టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంచాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించే ప్లీనరీకి పార్టీ కొందరు ప్రతినిధులకు ఆహ్వానం అందించిందని, వారంతా ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. ప్రజల మనస్సుల్లో నుంచి పుట్టిన టీఆర్ఎస్పై బీజేపీ, కాంగ్రెస్‌లు నిరంతరం కుట్ర చేస్తూనే ఉన్నాయని దుయ్యబట్టారు. ఢిల్లీలో కొట్టుకునే ఆ రెండు పార్టీలు తెలంగాణ గల్లీలో మాత్రం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహించారు.
యాసంగి ధాన్యాన్ని తీసుకోబోమని బీజేపీ ప్రభుత్వం ప్రకటిస్తే, పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ అందుకు భిన్నంగా టీఆర్ఎస్పై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఒకప్పుడు చెరువుల కింద భూములు సాగయ్యేవని, ఇప్పుడు కనబడడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. వరి సాగు చేసిన రైతుల కోసం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చారని, ఢిల్లీలో ధర్నాలు చేసినా కొనుగోలుకు అంగీకరించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు నష్టం జరగకూడదని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలును స్వయంగా చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్ మంచితనాన్ని మెచ్చుకోవాల్సిందిపోయి కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సరికాదన్నారు.
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలకు మతిలేదని, చేతలకు గతిలేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ సంస్కారం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడని, ఇలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర సర్కారు సంక్షేమ పథకాలు చూసి జీర్ణించుకోలేని బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మకై, టీఆర్ఎస్పై బట్టకాల్చి మీదేసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్పా, అనవసరమైన, అడ్డగోలు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించిన పాస్‌లను విద్యాసాగర్‌రావు ఆవిష్కరించారు. ఇక్కడ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి, మెట్పల్లి ఎంపీపీ సాయిరెడ్డి, జగిత్యాల పట్టణశాఖ అధ్యక్షుడు గట్టు సతీశ్, జగిత్యాల మండల శాఖ అధ్యక్షుడు బాల ముకుందం పాల్గొన్నారు.