కార్పొరేషన్, ఏప్రిల్ 25: విద్యారంగం అభివృద్ధిపై కేసీఆర్ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నగరంలోని హుస్సేనీపురలోని ప్రభుత్వ ఉర్ధూ మీడియం ప్రాథమిక పాఠశాల కోసం గుంటన్నర స్థలాన్ని విరాళమిచ్చిన అహ్మద్ బాయ్ కుటుంబసభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం స్కూల్ నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. విద్యతోనే క్రమశిక్షణ, సంస్కారం అలవడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్‌కు దీటుగా విద్యనందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 281 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి 1.35లక్షల మందికి మేలైన విద్యనందిస్తున్నదని చెప్పారు. సర్కారు బడుల్లో సకల వసతులు కల్పించే లక్ష్యంతో రూ.7600 కోట్లతో మన ఊరు-మన బడికి అంకురార్పణ చేసిందన్నారు.
కరీంనగర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.347 కోట్లతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. నగరంలోని 5,27, 28 డివిజన్లలో ఆయన మేయర్ వై సునీల్‌రావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడారు. అన్ని డివిజన్ల అభివృద్ధిపై దృష్టిపెట్టి కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, నగరంలోని ప్రతి వాడలో అభివృద్ధి పనులే ప్రజలకు దర్శనమిస్తున్నాయన్నారు. కార్పొరేటర్లు నాంపెల్లి శ్రీనివాస్, జహెరాబాను, గౌసియా బేగం, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బస్ సమీ, నాయకులు పాల్గొన్నారు.