కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 25: జిల్లాలో మే 6 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 14,804 మంది, ద్వితీయ సంవత్సరంలో 16,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని, తాగునీరు, విద్యుత్, పరిసరాల పరిశుభ్రత, వైద్య శిబిరాలు వంటి వసతుల ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ప్రశ్న పత్రాలను పోలీసు బందోబస్తుతో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు.
విద్యార్థులు కొవిడ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు వేసుకొని ఉండేలా చూడాలని, పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన సిట్టింగ్ స్వాడ్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని, పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. డీఐవో రాజ్యలక్ష్మి, డీఈవో జనార్దన్ రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి వెంకన్న, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
కలెక్టరేట్, ఏప్రిల్ 25: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 177 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 74, రెవెన్యూ శాఖకు 67, పంచాయతీ రాజ్ శాఖకు 5, మున్సిపల్‌కు 9, విద్యాశాఖకు 5తో పాటు ఇతర విభాగాలకు సంబంధించి 17 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, అగ్నిమాపకశాఖాధికారి వెంకన్న, పశుసంవర్ధక శాఖాధికారి నరేందర్,డీఏవో శ్రీధర్, ల్యాండ్ సర్వే ఏడీ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌వో డా. జువేరియా, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, మెప్మా పీడీ రవీందర్, ఎల్డీఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.