కరీంనగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దళిత బంధు యూనిట్లను పకడ్బందీగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సాయంత్రం ఆయన హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లోని క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో క్లస్టర్ వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంకా పూర్తిగా రాని యూనిట్ల కొటేషన్లు, బ్యాడ్జీ లైసెన్స్, ఇతర ధ్రువపత్రాలు సరిగ్గా లేని, మంజూరు కాని యూనిట్ల వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, క్లస్టర్ అధికారులు సేకరించాలన్నారు.
లబ్ధిదారులు వారికి నచ్చిన యూనిట్లను ఎంచుకొని, ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో విడుతల వారీగా 172 యూనిట్ల విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరు చేసిన వాహనాలను క్లస్టర్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీటీసీ చంద్ర శేఖర్ గౌడ్, జిల్లా నెహ్రూ యువ కేంద్రం కో-ఆర్డినేటర్ రాంబాబు, క్లస్టర్ అధికారులు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
అనాథ బాలలకు చెక్కుల పంపిణీ
కలెక్టరేట్, ఏప్రిల్ 25: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలలకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పంపిణీ చేశారు. జిల్లా మహిళా, పిల్లలు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 19 మంది బాలబాలికలకు రూ.3.82 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ఆర్థిక సాయం అందని వారు సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అనాథ బాలల మంచి, చెడులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ సాయం పొందుతూ ఉన్నత విద్యనభ్యసించి, ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈసందర్భంగా కంటి సమస్యతో బాధపడుతున్న బాలుడిని గమనించి, సత్వర వైద్య సేవలందించాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. జిల్లా మహిళా, పిల్లలు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అనాథ బాలల చదువు, ఇతర అవసరాలకు స్పాన్సర్షిప్ పథకం ద్వారా నెలకు రూ.2వేల చొప్పున మూడేళ్ల పాటు అందించనున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు 97 మంది బాలబాలికలకు రూ.19.40 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు జిల్లా సంక్షేమాధికారి పద్మావతి తెలిపారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో శ్రీలత, డీఎంహెచ్వో జువేరియా పాల్గొన్నారు.