కార్పొరేషన్/కొత్తపల్లి, ఏప్రిల్ 25: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం క్రీడా సంఘాల బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్లుగా కరోనాతో ఈ శిబిరాలను నిర్వహించలేకపోయామన్నారు. ఈ సంవత్సరం కరోనా నిబంధనలతో 25 క్రీడాంశాల్లో 30 రోజుల పాటు వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మే 5, 6వ తేదీల్లో అంబేద్కర్ స్టేడియంలో ఈ శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
15 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులని, పాల్గొనే వారందరికీ ఉచితంగా ప్రతిరోజు పండ్లు, గుడ్లు, పాలు అందిస్తామన్నారు. అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి ఇప్పటికే రూ. 20 కోట్లను ఖర్చు చేశామని, మరో రూ. 9 కోట్లు ఖర్చు చేసి డ్రైనేజీ, మైదానం, పెవిలియన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో నేర్చుకొని భావి భారత క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, వేసవి శిక్షణ శిబిరాలతో పాటు అంబేద్కర్ స్టేడియంలో కొన్ని క్రీడల్లో సంవత్సరం పొడవునా శిక్షణ ఇప్పించాలని కోరారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, డీవైఎస్వో రాజవీరు, ఎస్ఈ నాగమల్లేశ్వర్, బేస్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.