కలెక్టరేట్, ఏప్రిల్ 25: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ముస్లింలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంజాన్ నెలలో ముస్లింలు ఉపవాస దీక్ష చేస్తూ లోకమంతా చల్లగా ఉండాలని అల్లాను ప్రార్థించాలని కోరారు. అన్ని మతాలవారు ఒకరి పండుగను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, అన్ని వర్గాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ముస్లింలకు రంజాన్ మాసంలో నూతన వస్ర్తాలు అందిస్తున్నదని తెలిపారు.
జిల్లాకు గిఫ్ట్ ప్యాక్‌ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా గిఫ్ట్ ప్యాక్‌లు అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించా రు. ఈసందర్భంగా మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై.సునీల్‌రావు, కలెక్టర్ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ విజయకు సోయబ్ లతీఫ్ ఖురాన్‌ను బహూకరించారు. అంతకుముందు ముస్లింలకు మంత్రి గంగుల రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి పులి మధుసూదన్, తహసీల్దార్ సుధాకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, కార్పొరేటర్లు షోయబ్ లతీఫ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.