గంగాధర/బోయినపల్లి ఏప్రిల్ 24: రైతు సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా మొండికేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. పారాబాయిల్డ్ రైస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను అంచనావేయడంలో విఫలమైందని విమర్శించారు. గంగాధర మండలం గోపాల్రావుపేట, బోయినపల్లి మండలం తడగొండలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. గోపాల్రావుపేటలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఆయాచోట్ల వినోద్‌కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగం కోసం భారమవుతున్నా ధాన్యం కొనుగోలుకు ముందుకువచ్చారన్నారు. ఒక్కో క్వింటాల్‌కు రూ. 400 చొప్పున రాష్ట్రమే భరిస్తున్నదని తెలిపారు. అయితే కేంద్రం తన బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. ఆయా రాష్ర్టాల్లోని వాతావరణ పరిస్థితులకనుగుణంగా పంటలు పండుతాయని, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా రెండు సీజన్లలో వరి పంట పండుతుందన్నారు. యాసంగిలో వడ్లను మిల్లింగ్ చేస్తే నూకలు వస్తాయని ఈ కారణంగానే బాయిల్డ్ చేయాల్సివస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని పరగణలోకి తీసుకొని మోదీ ప్రభుత్వం గుడ్డిగా ధాన్యం కొనబోమని నిరాకరించడం బాధాకర మన్నారు.
కేసీఆర్ మెడలు వంచి ధాన్యాన్ని కొనిపిస్తామని చెప్పిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు గాలిమాటలతో రాద్ధాంతం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయన పాదయా త్ర పేరిట వాకింగ్ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. దమ్ముంటే ఆయన బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలో మాదిరిగా ధాన్యానికి మద్దతు ధర ఇప్పించాలని సవాల్ విసిరారు. వరంగల్ జిల్లా లో రైతుసదస్సు పెడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు పక్కనే వారి పాలిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి అక్కడి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టుడు ప్రసంగాలు ఆపి రైతులకు మేలు చేయాలని హితవు చెప్పారు. కార్యక్రమంలో బోయినపల్లి ఎంపీపీ వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమా కొండయ్య , ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మా జీ ఛైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ఎవో ప్రణిత, సర్పంచ్ చిందం రమేశ్ టీఆర్ఎస్ నాయకులు చెన్నాడి అమిత్‌కుమార్ ఉన్నారు.