చొప్పదండి, ఏప్రిల్ 24 : ఆ ఊరి రైతులు వినూత్నంగా ఆలోచించారు. సాగు కష్టాలనుంచి గట్టెక్కేందుకు ఇతర పంటలపై దృష్టిసారించారు. ఇంటి అవసరాల కోసం మాత్రమే వరి వేస్తూ.. తక్కువ సమయంలో అధిక దిగుబడులకు అవకాశమున్న కూరగాయల సేద్యాన్ని ఎంచుకున్నారు. స్వల్ప పెట్టుబడులతో దండిగా లాభాల పంట పండిస్తున్నారు. మరోవైపు పశువుల పెంపకంలోనూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. నిత్య ఆదాయంతో సంతోషంలో మునిగితేలుతూ ఆదర్శంగా నిలుస్తున్న మల్లన్నపల్లి రైతాంగం విజయ గాథ ఇది..
చొప్పదండి మండలంలోని కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లన్నపల్లి రైతులు కూరగాయల సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. తీరొక్క రకాలు వేస్తూ లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, టమాట, ఉల్లి, వెల్లుల్లి, బీరకాయ, వంకాయ, సోరకాయ, బెండకాయ, చిక్కుడు, అలిచింత, గోరుచిక్కుడు, తోటకూర, పాలకూర కొత్తిమీర. మెంతికూర ఇలా అన్ని రకాల కూరగాయలను సాగుచేస్తున్నారు. పంట వేసేటప్పటి నుంచి కోసేవరకు సేంద్రియ ఎరువుతో పాట అవసరం మేరకు రసాయన మందులను వినియోగిస్తున్నారు. చీడపీడలు, రోగాలు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ పంట చేతికచ్చేంతవరకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులే..
గ్రామంలో ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులే కూరగాయలు సాగు చేస్తున్నారు. గ్రామంలో 90 శాతానికి పైగా రైతులు తోటల్లో, సాగుకు అనుకూలం ప్రదేశాల్లో, ఇంటిముందు ఖాళీస్థలాల్లో కూరగాయల పంటలను పండిస్తున్నారు. కాలానుగుణంగా సాగు చేస్తారు. పంటలు చేతికొచ్చిన తర్వాత పట్టణాలు, నగరాల్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. గ్రామస్తులు తాము సాగుచేస్తున్న మక్కజొన్న పంటలో అంతర్ పంటగా కూరగాయలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో కొంత మంది రైతులు నాబార్డు సహకారంతో రుణం పొంది కోళ్లు, ఆవుల పెంపకం,చేస్తూ ఆశించిన మేర ఆదాయాన్ని పొందుతున్నారు.
రైతులకు ఉచితంగా విత్తనాలిచ్చినం
మల్లన్నపల్లి గ్రామంలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నాబార్డు వారి సహకారంతో ఉచితంగా కూరగాయల విత్తనాలతో పాటు బంతి పూల విత్తనాలు పంపిణీ చేశారు. గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలను కూడా సబ్సిడీపై అందించారు. మా గ్రామస్తు లు వీటిని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరం కూరగాయలు పండిస్తూ ఆదాయం పొందుతున్నారు. బర్రెలు, ఆవులు తీసుకున్న వారు పాలకేంద్రాలకు పాలు పోస్తూ ఆదాయం పొందుతున్నారు.
–బండారి కొమురయ్య, మల్లన్నపల్లి
ఎదురుచూసే పనిలేదు
వరివేస్తే పైసల కోసం నాలుగు నెలలు ఎదురుచూడాలి. పెట్టుబడి కూడా ఎక్కువే. కూరగాయలు వేస్తే రెండునెలల్లోనే ఆదాయం చేతికొస్తుంది. ఖర్చులుకూడా తక్కువే. అందుకే పదేండ్ల సంది నాకున్న నాలుగెకరాల్లో 20 గుంటల్లో కాకర, గోరుచిక్కుడు, టమాట, వంకాయ, పెసర, బబ్బెర, కొత్తిమీర, ఎల్లి, మెంతి, తోటకూర పండిస్తున్న. ఒక పంట కాపుకు వచ్చిన వెంటనే మరొక పంట వేస్త.
–భక్తు శ్రీనివాస్, మల్లన్నపల్లి
ఆవులపెంపకంతో ఉపాధి పొందుతున్నా…
చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో నాబార్డు వారి సహకారంతో నాకు సబ్సిడీపై ఇచ్చిన ఆవులను పెంచుకుంటున్న. మూడు ఆవులు రోజుకు 15లీటర్ల వరకు పాలు ఇస్తయ్. ఈ పాలను పాలకేంద్రంలో పోస్తా. ప్రొదున, సాయంత్రం ఆవులకు మేత వేస్తూ వాటిని పెంచుతున్న. ఆవుల పెంపకంతో పాటు వ్యవసాయం చేస్తూ, ఐస్‌క్రీంలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్న.
–బండారి మల్లయ్య, మల్లన్నపల్లి