పెద్దపల్లి రూరల్/ మల్యాల ఏప్రిల్ 24: పెద్దపల్లి మండలం పెద్దకల్వల శివారులో స్కార్పియో కారు ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరూ దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఐదుగురు స్కార్పియో వాహనంలో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. పెద్దకల్వల శివారులో ఆదివారం తెల్లవారుజామున ముందు వెళ్తున్న ట్రక్‌ను ఓవర్‌టెక్ చేయబోయి రోడ్డు పక్కన ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో స్కార్పియో ముందుభాగం నుజునుజ్జయింది. ఇందులో ప్రయాణిస్తున్న చైత్రముఖి(25), హులాస్రామ్(40) అక్కడికక్కడే మరణించారు. రాహుల్సత్పూరి, దుక్రాంతిక, నాగేంద్రసహారితో పాటు డ్రైవర్ కరణ్ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న నాగేంద్రసహారిని కరీంనగర్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పెద్దపల్లి ఠాణా ఎస్ఐ-3 రాజవర్ధన్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని సందర్శించారు. స్థానికులతో మాట్లాడి ప్రమాదతీరుపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి ఎస్ఐ రాజేశ్ పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. మరోమహిళ పరిస్థితి విషమంగా ఉన్నది. మల్యాల ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన వేముల కనకదాసు, భార్య వేముల లావణ్యతో కలిసి ఆదివారం ఉదయం బైక్‌పై జగిత్యాల మండలంలోని ధరూర్‌లో ఓ శుభకార్యానికి వెళ్లాడు. మధ్యాహ్నం 3:45 గంటలకు నూకలమర్రికి తిరుగుపయనమయ్యారు. జగిత్యాలలోని టీఆర్‌నగర్‌కి చెందిన సయ్యద్ యాసిన్, మల్యాలకు చెందిన కట్కూరి మహేశ్ కలిసి బైక్‌పై మల్యాల నుంచి జగిత్యాలకు వెళ్తున్నారు.
రాజారం వద్ద కనకదాసు బైక్‌ను అతివేగంగా వచ్చి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కనకదాసు(48), సయ్యద్ యాసిన్(17) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లావణ్య, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకొని వీరిని జగిత్యాల దవాఖానకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. కాగా, మహేశ్ (17) కరీంనగర్‌లోని అపోలోరీచ్ దవాఖానలో చికిత్సపొందుతూ మరణించాడు. కనుకదాసుకు ఇద్దరు బిడ్డలు పుష్ప, ఝాన్సీ, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. బాలుడు అజాగ్రత్తగా, వేగంగా బైక్ నడపడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుడు వేముల కనకదాసు తమ్ముడు వేముల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మేకల మందపైకి దూసుకెళ్లిన లారీ
రుద్రంగి, ఏప్రిల్ 24: మేకల మందపై లారీ దూసుకెళ్లడంతో 22 మేకలు మృత్యువాత పడిన సంఘటన రుద్రంగి శివారులో చోట్టుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన ఎరువుల లారీ ఆదివారం ఉదయం 4.30 గంటల సమయంలో వేములవాడ నుంచి కోరుట్ల వైపు వెళ్తుండగా రుద్రంగి గ్రామ శివారులో రోడ్డుపై వెళ్తున్న జక్కుల మల్లేశంకు చెందిన మేకల మందపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 22 మేకలు అక్కకడికక్కడే మృతి చెందాయి. ప్రమాదం జరుగగానే డ్రైవర్ పరారుకావడంతో లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జక్కుల మల్లేశానికి న్యాయం చేయాలని యాదవ సంఘం నాయకులు రహదారిపై బైఠాయించి ధర్నా చేయడంతో సుమారు గంట సేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ శ్రీలత సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు.