ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 24: బాల్యంలోనే తండ్రి చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆ ఇంటి ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి ఆసరాగా నిలిచింది. తల్లి పాచిపనులు చేసి కూతురును పెంచి పెద్ద చేసినా కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్థోమత లేక బాధపడుతున్న ఆ తల్లికి కల్యాణలకే్ష్మ కట్నమైంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన జెల్ల భాగ్యలక్ష్మి-భూమయ్య దంపతులకు ఒక్కగానొక్క కూతురు జ్యోతి జన్మించింది. విలేజ్ కరెంట్ హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్న భూమయ్య తన కూతురు రెండేండ్ల వయసులో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా 18 ఏండ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమాయకురాలైన తల్లి ఇరుగు, పొరుగు ఇండ్లలో పాచి పనులు, వ్యవసాయ, భవన నిర్మాణ కూలీ పనులు చేస్తూ కూతురును పోషించుకునే పరిస్థితి ఏర్పడింది.
తన కూతురును పోషించడం ఇబ్బందికరంగా మారడంతో గ్రామస్తులు ఆమెను సిరిసిల్లలోని రంగినేని ట్రస్టులో జాయిన్ చేశారు. పదో తరగతి పూర్తయిన అనంతరం నారాయణపూర్‌కు చెందిన నలిమెల సోదరులు ఎంపీఎచ్డబ్ల్యూలో చదివించారు. పెళ్లీడుకు వచ్చిన కూతురుకు వివాహం జరిపించేందుకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌కు చెందిన పిట్ల భారతమ్మ-బాలయ్య కుమారుడు సంతోష్ కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బులు కట్నంగా తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. ఇది తెలియగానే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తాను కూడా సాయం అందించాడు.
నారాయణపూర్‌లో ఆదివారం వివాహం జరుగగా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి పుస్తెమట్టెలను వితరణగా అందించారు. అదే గ్రామానికి చెందిన నలిమెల సోదరులు భాస్కర్, శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రకాశ్ రూ.50వేలు నగదు సాయం అందించారు. గ్రామస్తులు స్పందించి పెళ్లికి కావాల్సిన సామగ్రిని, ఆర్థిక సాయాన్ని అందించి పేదింటి పెళ్లికి పెద్దదిక్కయ్యారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారానే తన కూతురు పెళ్లి జరిగిందని ఆ తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.