కలెక్టరేట్, ఏప్రిల్ 24: మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. మహిళా అభివృద్ధే లక్ష్యంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండగా, తాజాగా స్వయం సహాయక సంఘాలకు అందజేసే రుణ మొత్తాన్ని పెంచింది. ఇందుకనుగుణంగా బ్యాంకర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే సెర్ప్ అధికారులు జిల్లా యంత్రాంగానికి రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ, ఉత్తర్వులు పంపారు. దీంతో, గతంలో కన్నా అధికంగా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు గతేడాది తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లించి రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచారు.
నిర్దేశించిన లక్ష్యానికి మించి 102.12 శాతం రుణాలు చెల్లించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.128.06 కోట్లు అధికంగా రుణం అందజేసేందుకు అధికారులు ముందుకు వచ్చారు. జిల్లాలోని 11,411 మహిళా సంఘాలకు రూ.640.31 కోట్ల రుణాలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాలోని ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వరకు రుణం ఇచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తున్నది. మండలాల వారీగా సంఘాలకు రుణ బడ్జెట్ కేటాయింపులు చేసిన అనంతరం, ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ లింకేజీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2021-22లో జిల్లా వ్యాప్తంగా 11,151 ఎస్‌హెచ్‌జీలు ఉండగా రూ.512.25 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే, 8,916 సంఘాలకే రూ.523.14 కోట్లు అందించారు. 102.12 శాతం లక్ష్యాన్ని చేరుకొని ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. అలాగే, వసూళ్లలో కూడా ఇదే స్థాయిలో ఉండడంతో ఈసారి రుణ పరిమితి మరింత పెంచుతూ సెర్ప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్నది. ఒక్కో సంఘానికి గతంలో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మాత్రమే రుణాలు అందజేయగా, ఈసారి రూ.10 లక్షల వరకు పంపిణీ చేసేందుకు బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఏటేటా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్న సంఘాల జాబితాల తయారీలో గ్రామీణాభివృద్ధి శాఖ నిమగ్నమైంది. తీసుకున్న మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీలో పెట్టుబడి పెడుతున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయం నుంచే సకాలంలో తిరిగి రుణాలు చెల్లిస్తున్నారు. ప్రధాన వ్యాపారులు, ఇతర భారీ పరిశ్రమల్లో పెట్టుబడులుగా రుణాలు తీసుకున్న వారితో పోల్చితే ఎస్‌హెచ్‌జీ మహిళల రుణాలు నిర్దేశించిన గడువుకన్నా ముందే వసూలవుతుండగా, బ్యాంకర్లు కూడా పెద్ద మొత్తంలో రుణాలందించేందుకు ఆసక్తి చూపుతున్నారు.