జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల రూరల్, ఏప్రిల్ 23 : కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనబోమని మొండికేసినా రూ. వేల కోట్ల నష్టాన్ని భరించి కొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో శనివారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ రవి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధరూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమాత్యుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నా.. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తున్నదన్నారు.
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం వేల కోట్ల నష్టం యాసంగి ధాన్యం కొంటున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పల్లెల సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కలెక్టర్ రవి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదే గ్రామంలో 1.8 కోట్ల వ్యయంతో నిర్మించే ఎల్లమ్మ గుడి రోడ్డు నిర్మాణ పనులకు, 10 లక్షలతో నిర్మించే హనుమాన్ ఆలయ మండపం పనులకు శంకుస్థాపన చేశారు. ధరూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోని గ్రామాల్లో 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం, డంప్ యార్డ్, నర్సరీ, ట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 ఉత్తమ గ్రామాల్లో ఏడు మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమన్నారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. యాసంగి సీజన్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల నూక శాతం అధికంగా ఉంటుందని, వీటి వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, 24 గంటల విద్యుత్, మద్దతు ధరకు వరిధాన్యం కొనుగోలు లాంటి పథకాలతో దేశానికే తెలంగాణను రోల్‌మోడల్‌గా మార్చివేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని, రైతుల ఉద్యమానికి దిగివచ్చి చట్టాలను వెనకి తీసుకుందని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లోనే తెలంగాణ పురోగమిస్తుందన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ నిజమైన వారసుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన జరగాలంటే, చదువు అన్ని వర్గాలకు అందుబాటులోకి రావాలని భావించిన సీఎం కేసీఆర్ 238 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. ఏటా ఈ పాఠశాలల్లో 4.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.
30 మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభించారన్నారు. రాష్ట్రంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 100 మందికి దళిత బంధు పథకాన్ని అందిస్తున్నామన్నారు. 2022-23 బడ్జెట్లో దళిత బంధు పథకానికి రూ. 17,800 కోట్లు కేటాయించామన్నారు. 2.40 లక్షల కుటుంబాలకు ఈ యేడాది దళిత బంధు వర్తింపజేస్తామన్నారు. ఏడు సంవత్సరాల వ్యవధిలో 17 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం వర్తింపజేసి వారిని ఆర్థిక స్వావలంభన దిశలో నడిపిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషితో 100 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసుకున్నామని, కరోనా కారణంగా రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోవడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
రాంపూర్ పంప్ హౌస్ వద్ద తూము ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామానికి ఉన్న సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిషరించామని, ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అంతర్గాం గ్రామంలో 900 మందికి ఆసరా పెన్షన్లు, రైతు బంధు కింద 2 పంటలకు కలిపి 1.6 కోట్లు, గ్రామ అభివృద్ధికి సంవత్సరానికి 40 లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని తెలిపారు. గ్రామంలో 1.3 కోట్ల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశామని, నూతన పార్ ఏర్పాటు కోసం 40 లక్షల నిధులు మంజూరు చేశామని, అదనంగా గ్రామాభివృద్ధికి కోటి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పోతారం రోడ్డు పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేసే విధంగా మంత్రి కృషి చేయాలని కోరారు.
అనంతరం జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ నడుపుతున్నారన్నారు. అంతర్గం గ్రామంలో తీవ్రమైన కరువు సమస్య ఉండేదని, రాంపూర్ పంప్‌హౌస్ వద్ద తూము ఏర్పాటు చేసి చెరువులో నింపుకొని 1000 ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య, జిల్లా కలెక్టర్ జీ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు అదనపు కలెక్టర్ బీఎస్ . లత, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో 400 మంది చేరిక
కాంగ్రెస్, బీజేపీకి చెందిన సుమారు 400 మంది దళితులు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో శనివారం గొల్లపల్లిలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.