ముకరంపుర, ఏప్రిల్ 23;కరీంనగర్ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు వైపు అడుగులు పడుతున్నాయి. నీటి వసతి.. సారవంతమైన నేలలు.. అనువైన వాతావరణం ఉండడంతోపాటు సర్కారు సైతం ప్రోత్సహిస్తుండడంతో ఈ పంట సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం మలేషియాకు చెందిన లోహియా కంపెనీతో ఒప్పందం చేసుకొని 10 లక్షల మొలకలను తెప్పించింది. చిగురుమామిడిలో 80 ఎకరాల్లో ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేసి, వాటిని పెంచుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో మూడేళ్లలో 50 వేల ఎకరాల్లో సాగు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మారుతున్న పరిస్థితులు.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగులో మార్పు వస్తున్నది. సర్కారు ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు అన్నదాతలు ముందుకు వస్తున్నారు. సారవంతమైన నేలలు…సాగునీటి వసతి…అనుకూలమైన వాతావరణం ఉండడంతో రైతుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మూడేళ్లలో 50వేల ఎకరాల్లో సాగు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 10వేల ఎకరాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే అంతా సిద్ధం చేస్తున్నారు.
లోహియా కంపెనీకి కరీంనగర్ జిల్లా బాధ్యతలు
కరీంనగర్ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి ప్రభుత్వంతో లోహియా కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. ఈ మేరకు కంపెనీ నర్సరీల్లో నాణ్యమైన మొక్కలను పెంచి రైతులకు అందించాలి. కొత్తగా సాగు చేస్తున్నందున కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రతి దశలో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు సూచనలు అందిస్తారు. కంపెనీ స్థానికంగా ఇక్కడే ఫ్యాక్టరీని సైతం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
80 ఎకరాల్లో నర్సరీ
వచ్చే ఏడాది జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటడం లక్ష్యం. ఉద్యాన అధికారుల లెక్కల ప్రకారం ఎకరానికి 60 మొక్కలు నాటాలి. ఇందుకోసం చిగురుమామిడిలో 80 ఎకరాల్లో లోహియా కంపెనీ ప్రత్యేకంగా నర్సరీని అందుబాటులోకి తెచ్చింది. మూడు నెలల క్రితం మలేషియా నుంచి 10 లక్షల మొలకలు జిల్లాకు చేరాయి. వేసవి దృష్ట్యా మొక్కలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా షేడ్నెట్లలో ఆరోగ్యంగా పెరిగేలా చర్యలు తీసుకుంటూ ఏడాది పాటు మొక్కలను పెంచనున్నారు. అనంతరం ఎంపిక చేసిన క్షేత్రాల్లో నాటేందుకు సరఫరా చేస్తారు. ఇప్పటికే జిల్లాలో ఉద్యాన శాఖ అధికారులు ఆయిల్‌పామ్ సాగుకు అనువైన క్షేత్రాలతో పాటు రైతులను గుర్తించారు. ఔత్సాహికులైన 500 మంది రైతులను అశ్వరావుపేటలోని ఆయిల్‌పామ్ తోటలతో పాటు ఫ్యాక్టరీని సందర్శనకు తీసుకువెళ్లారు.
మెట్ట ప్రాంతాలకు వరం..
ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో మూడెకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను పెంచవచ్చు. దీంతో మెట్ట ప్రాంతాల రైతులకు ఆయిల్‌పామ్ వరంగా మారనుంది. నీటిని పొదుపుగా వినియోగించేలా రైతులకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై డ్రిప్‌ను మంజూరు చేయనున్నారు. ఒక్కో ఆయిల్‌పామ్ మొక్క పూర్తి ధర రూ.115 కాగా రాయితీపై రూ.33కే రైతులకు అందించనున్నారు.
రైతుల నుంచి స్పందన ఉన్నది..
ఆయిల్‌పామ్ సాగు పట్ల జిల్లాలో రైతుల నుంచి మంచి స్పందన ఉంది. లాభదాయకంగా ఉంటుంది. దళారీ వ్యవస్థ ఉండదు. ప్రభుత్వంతో కంపెనీ చేసుకున్న ఒప్పందం ప్రకారం మొక్కల సరఫరాతో పాటు దిగుబడి కొనుగోలు వరకు అన్ని నిబంధనల ప్రకారమే జరుగుతాయి.
– బండారి శ్రీనివాస్, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి