మానకొండూర్/చొప్పదండి/రామడుగు/చిగురుమామిడి, ఏప్రిల్ 23 :ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల జాతర కొనసాగుతున్నది. యాసంగి వడ్ల సేకరణ ప్రక్రియ జోరందుకున్నది. ఇప్పటికే పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, శనివారం మరిన్ని గ్రామాల్లో మొదలయ్యాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి వారి నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుండడంతో రైతులు ధాన్యం తరలిస్తున్నారు. కాగా, శనివారం జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కలెక్టర్ రవి, ఎమ్మెల్యె డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సెంటర్‌ను ప్రారంభించగా, చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, చిగురుమామిడి గ్రామాల్లో ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, చొప్పదండి మండలంలోని రుక్మాపూర్, వెదురుగట్ట, కొలిమికుంట, దేశాయిపేట, ఆర్నకొండ, గుమ్లాపూర్ గ్రామాల్లో, రామడుగు మండలంలోని తిర్మలాపూర్, లక్ష్మీపూర్, దత్తోజిపేట, కొక్కెరకుంట గ్రామాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్ రావుతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంతోపాటు పెగడపల్లి, గంగారం, మల్యాల గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆయా చోట్ల మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదన్నారు. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం రాద్ధాంతం చేస్తున్నా, అన్నదాతలు నష్టపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.