కొత్తపల్లి, ఏప్రిల్ 23 : ఓ వైపు నిత్యావసరాల ధరలు, కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా కోడిగుడ్డు ధర మాత్రం రోజురోజుకూ పడిపోతున్నది. కోడి గుడ్డు ధరలు మాత్రం పౌల్ట్రీ రైతులకు మాత్రం కన్నీళ్లనే మిగులుస్తున్నాయి. ఒక గుడ్డును ఉత్పత్తి చేసేందుకు రూ. 4 ఖర్చవుతుండగా, రైతుకు రూ.2.95 పైసలు మాత్రం అందుతుండడంతో ఆర్థికంగా నష్టం కలుగుతున్నది. హోల్‌సేల్ మార్కెట్లో 100 గుడ్లకు రూ. 322 ధర పలుకుతుండగా రిటైల్‌గా గుడ్డుకు రూ.3.50 ధర పలుకుతున్నది. ఎండ వేడిమి తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలో నడుస్తుండడంతో పౌల్టీ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. మరోవైపు మండే ఎండలతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 500కు పైగా కోళ్ల ఫామ్‌లు ఉండగా వీటిలో సుమారు 25 లక్షల వరకు కోళ్లను రైతులు పెంచుతున్నారు. ఇటీవల దాణా రేట్లు పెరగడం, గుడ్డు ధర మూడు రూపాయలకు చేరుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల దాణా టన్ను రూ 18 వేల నుంచి రూ 30 వేల వరకు చేరడం, కోళ్ల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఒక్కొక్క కోడిగుడ్డు ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి కొత్త బ్యాచ్‌లను వేసేందుకు రైతులు వెనుకాడుతున్నారు.
పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
రోజురోజుకూ పడిపోతున్న గుడ్డు ధరలు రైతులకు కన్నీళ్లను మిగులుస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ ఇలాంటి నష్టాలను చూడలేదు. కోళ్ల దాణా టన్నుకు రూ. 30వేలకు పెరుగడంతో ఆర్థికంగా భారమవుతున్నది. హోల్‌సేల్‌గా మార్కెట్లో గుడ్డు ధర రూ 3.50 వరకు పలుకుతుండగా రైతుకు మాత్రం రూ.2.95 మాత్రమే అందుతుంది. ఎగుమతులు సరిగ్గా లేవని సాకును చూపుతూ దళారులు పౌల్ట్రీ రైతులను మరింత నష్టాలకు గురిచేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌల్ట్రీని నడపాలంటే రైతు రోజుకు వెయ్యికి పైగానే నష్టాన్ని చవిచూడాల్సి వస్తున్నది.
– కోట సంపత్, పౌల్ట్రీ యజమాని, నగునూరు