కలెక్టరేట్, ఏప్రిల్ 22 : ఇక్కడ భూమికి సమాంతరంగా నిండుకుండలా కనిపిస్తున్న బావి కోరుట్ల రూరల్ మండలం జోగినపల్లి శివారులోనిది. కల్లెడ రాజం అనే రైతుకు చెందిన ఈ బావి లోతు 20 మీటర్లు.. ఈ గ్రామానికి కాకతీయ కాలువ ఉన్నా గతంలో ఇలా ఎప్పుడూ నీళ్లు కనిపించిన దాఖలాలు లేవు.. ఎండకాలం వచ్చిందంటే ఎక్కడో పాతాళంలో ఉండేవి. సాగునీరు అందక పొలాలు ఎండిపోయేవి. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం.. కాలువ ఎప్పుడూ నిండుగా పారడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఇలా అమాంతం పెరిగాయి. నట్టెండకాలంలోనూ భూమికి సమాంతరంగా ఉబికి వచ్చాయి. తన బావిలో నీటిని చూసి రైతు రాజం సాగునీటికి రందీలేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాడు.
తలాపున మానేరు ఉన్నా తాగునీటికి గోసపడేది. ఎండకాలం వచ్చిందంటే గుక్కెడు నీటి కోసం బిందెలతో మైళ్లకొద్దీ వెళ్లాల్సి వచ్చేది. అడుగంటిన బోరుబావులు, ఎండిన పొలాలు. ఇది సమైక్య పాలనలో మన దుర్గతి.. కానీ తెలంగాణ సిద్ధించిన తర్వాత పరిస్థితి మారింది. ప్రజల మద్దతుతో సీఎం పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్ భగీరథ యత్నం ఫలించింది. కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టులకు అంకురార్పణ చేసి అకుంఠిత దీక్షతో పూర్తి చేయడంతో ఇప్పుడు ఉమ్మడి జిల్లా జలకళతో ఉట్టిపడుతున్నది. మండుటెండల్లోనూ ఉబికి వచ్చిన భూగర్భజలాలు, నిండుగా కనిపిస్తున్న వాగులు, వంకలతో సజీవంగా దర్శనమిస్తున్నది. నేలతల్లి పులకరిస్తున్నది.
సమైక్యపాలనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు నీళ్లకోసం అరిగోసపడ్డారు. పక్కనే మానేరు పారుతున్నా ఎండకాలం వచ్చిందంటే సాగునీటికి దెవుడెరుగు కనీసం గొంతు తడుపుకుందామంటే గుక్కెడు తాగునీరు దొరకని పరిస్థితి. 30 మీటర్లకు పైగా లోతు తవ్విన వ్యవసాయ బావుల్లో, వందలాది ఫీట్ల లోతు వేసిన బోరుబావుల్లో కూడా చుక్క నీరు లేక, విలవిల్లాడిన ఘటనలు అనేకం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా కనీసం సగం కూడా పూర్తిచేయలేదు. మన మెట్ట మగాణుల్లో బంగారు పంటలు తీసే అవకాశం ఉన్నా, నీటి లభ్యత లేక భూములన్నీ బీళ్లుగా మారాయి.
ఏండ్లకేండ్లుగా నీటి తడిలేక నల్లరేగడి నేలలు నెర్రెలు బారాయి. వర్షాకాలంలో సైతం నీటి నిల్వలు పాతాళానికి చేరాయి. స్వరాష్ట్రం సిద్ధించడం, ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో నీటి గోసను తీర్చేందుకు భగీరథ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టులతో పాటు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ను పూర్తి చేయడంతో ఉమ్మడి జిల్లాకు మహర్దశ పట్టింది.
వానకాలంలో కూడా ఆరుతడి పంటలు మాత్రమే వేసుకునే రోజుల నుంచి, ఏడాదికి మూడు పంటలు తీసే పరిస్థితులు వచ్చాయి. మండుటెండల్లో కూడా భూగర్భ జలాలు పైపైకి ఉబికివస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. రెండేళ్ల క్రితం దాకా భూగర్భంలో నీటి నిల్వలు ఓ మోస్తరుగానే ఉన్నా, తాజాగా ఏయేటికాయేడు భూగర్భ నీటి మట్టం పెరుగుతుండడంతో, జిల్లావాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు..
2021 ఫిబ్రవరిలో 6.88 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.96 మీటర్లకు వచ్చాయి. 2020 మార్చిలో 7.82 మీటర్లు, గతేడాది మార్చిలో 7.46 మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం, ఈ ఏడాది మార్చిలో 6.98 మీటర్ల పైకి వచ్చింది. యాసంగిలో జిల్లా రైతాంగం అత్యధికంగా వరి సాగు చేసి, నిరంతరం నీటిని వినియోగిస్తున్నా భూగర్భ జలాల తరుగుదలలో అంతగా తేడా లేకపోవడం గమనార్హం. నవంబర్ నెల నుంచే నాట్లు వేయడంతో నీటి వినియోగం పెరిగింది.
ప్రస్తుతం 80 శాతం మేర వరి పంట కోత దశకు చేరుకోగా, మరో వారం రోజుల అనంతరం మిగతా ఇరవై శాతం కూడా కోతకొచ్చే అవకాశాలున్నాయి. అనంతరం నీటి వినియోగం పూర్తిగా తగ్గి భూగర్భ జలాలు మరింత పైకి రానున్నాయి. 2021లో భగ భగ మండే మే మాసంలో 2.19 మీటర్ల పైకి రాగా, ఈ ఏడాది అంతకన్నా పైకి వచ్చే అవకాశాలున్నాయి. వచ్చే వానకాలం ఆశించిన మేర వర్షాలు కురవకున్నా రంది లేకుండా పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి.