కలెక్టరేట్, ఏప్రిల్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా 8వ విడుత కార్యక్రమానికి జిల్లా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో నీడనిచ్చే, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. మరో రెండు మాసాల్లో చేపట్టబోయే హరితహారంలో లక్ష్యం మేరకు మొకలు నాటేందుకు అందివచ్చేలా, తగిన పోషణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలకు నిర్దేశించిన సంఖ్యకు అనుగుణంగా మొకలు పెంచాలని ఉన్నతాధికారులు ఇప్పటికే నర్సరీల నిర్వాహకులకు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
36.05 లక్షల మొకలు నాటడం లక్ష్యం
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రోడ్ల పక్కన, కాలువ గట్లు, చెరువులు, కుంట కట్టలపైన, బీడు, బంజరు భూముల్లో, బయో ఫెన్సింగ్‌తో పాటు ఇతరత్రా విధానాల్లో ఏడేళ్లుగా జిల్లా వ్యాప్తంగా కోట్లాది మొకలు నాటారు. నాటిన మొకలకు ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టారు. ట్రీగార్డుల ఏర్పాటుతో పాటు నిత్యం వాటికి నీళ్లు పట్టేందుకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ట్యాంకర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించగా, ఏపుగా పెరిగి పచ్చదనం పంచుతున్నాయి. అదే తరహాలో ఈ ఏడాది కూడా 313 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 36.05 లక్షల మొకలు నాటడం లక్ష్యంగా నిర్దేశించారు. గతేడాది 24,87,917 మొక్కలు నాటగా, ఈసారి లక్ష్యాన్ని పెంచారు.
మండలాల వారీగా లక్ష్యాన్ని పరిశీలిస్తే గంగాధరలో 3.80 లక్షలు, మానకొండూర్ మండలంలో 3.10 లక్షలు, వీణవంకలో 3 లక్షలు, సైదాపూర్‌లో 2.95 లక్షలు, కేశవపట్నంలో 2.76 లక్షలు, తిమ్మాపూర్, రామడుగు మండలాల్లో 2.65 లక్షల చొప్పున, జమ్మికుంటలో 2.30 లక్షలు, హుజూరాబాద్‌లో 2.19 లక్షలు, ఇల్లందకుంటలో 2.07 లక్షలు, కరీంనగర్‌రూరల్, చిగురుమామిడి మండలాల్లో 1.96 లక్షల చొప్పున, చొప్పదండిలో 1.90 లక్షలు, గన్నేరువరంలో 1.84 లక్షలు, కొత్తపల్లి మండలంలో 92 వేల చొప్పున మొక్కలు నాటడం లక్ష్యం నిర్దేశించారు. ఇందుకనుగుణంగా పంచాయతీల్లో మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నర్సరీల్లో గ్రీన్ షెడ్లు ఏర్పాటు చేసి, మొక్కలకు ఎండదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నర్సరీల్లో సుమారు 29 లక్షల మొక్కలు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను ఎప్పటికప్పుడూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సందర్శిస్తూ, చీడ, పీడల బారి నుంచి కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు.
నీడనిచ్చే, పండ్ల మొకల పెంపకం
గ్రామాల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో ఈ ఏడాది అధికంగా నీడనిచ్చే, పండ్ల, పూల మొకలు పెంచుతున్నారు. ఎనిమిదో విడుత హరితహారంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసేందుకు వాటిని పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ మొకలతో పాటు పండ్ల మొకలు కలిపి, ప్రతి ఇంటికి కనీసం 5, 6 మొకలను ఇచ్చి పెంచాలని ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆదేశాలు తప్పకుండా అమలు చేసేలా, ఆయా గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మొకల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారం విజయవంతం చేసేందుకు జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు.